తిరుమలగిరికి దళిత బంధు పథకం
దశాబ్దాల తరబడి నీళ్లు లేక, నిధులు రాక, కన్నీళ్లను మింగి కరువును నెత్తిన మోసింది తుంగతుర్తి నియోజకవర్గం. చేసేందుకు పని లేక, కడుపు నిండా తిండి దొరక్క అల్లాడిన బతుకులిక్కడ అనేకం. రాజకీయ పార్టీల గొడవలే తప్ప పేదోడిని పట్టించుకున్న నాయకుడుంటే కదా!
స్వరాష్ట్రంలో కాళేశ్వరం జలాలతోనే ఈ ప్రాంతంలో సరికొత్త జీవన అధ్యాయం మొదలైంది. సీఎం కేసీఆర్ కృషితో గోదారమ్మ ఇక్కడి భూములను, బతుకులను పచ్చగ మారుస్తున్నది. ఉన్నచోటే ఉపాధి దొరుకుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సబ్సిడీ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో దశల వారీగా యాదవులు, మత్స్యకారులు, నాయీబ్రాహ్మణులు, రజకులను ఆదుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు దళిత బాంధవుడిగా మారారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించారు. ఇక్కడ 2,500 వరకు దళిత కుటుంబాలు ఉండగా, అందులో దాదాపు 85 శాతం మంది కూలి ఆధారపడి బతుకీడు స్తున్నారు. దళిత బంధుతో ఇప్పుడు ఒక్కో కుటుంబం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10లక్షల సాయం అందుకుని సాధికారత దిశగా అడుగులు వేయనున్నది. కూలీలుగా ఉన్నవాళ్లు ఓనర్లుగా మారనున్నారు. చిన్న పరిశ్రమలతో మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగనున్నారు.
2,500 కుటుంబాలకు లబ్ధి
ప్రస్తుతం 85 శాతం మందికి కూలి పనులే ఆధారం
ఒక్కో కుటుంబానికిరూ.10లక్షల సాయం
ముఖ్యమంత్రి కేసీఆర్కుదళితుల కృతజ్ఞతలు
తిరుమలగిరిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
దళితుల పాలిట దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ :
ఎమ్మెల్యే గాదరి కిశోర్
సూర్యాపేట, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం దళిత బంధు పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతున్నది. మండల వ్యాప్తంగా దళితులు ఆనందం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఎమ్మెల్యే కిశోర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు.
కాళేశ్వరం జలాలతో తీరిన కరువు
దశాబ్దాల తరబడి సాగునీరు కాదు కదా దాహార్తి తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు దొరుకక కరువు కాటకాలతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గాన్ని నాటి ప్రభుత్వాలు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. నియోజకవర్గంలో ఎటు చూసినా బీడు భూములు, సర్కారు తుమ్మలు కనిపించేవి. 2.67లక్షల ఎకరాల్లో బోర్లు, బావులతో దాదాపు పది శాతం కూడా సాగు చేయకపోయేవారు. ఇక ఇక్కడి దళితుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో ఇప్పుడిప్పుడే సాగు భూములు పచ్చబడి రైతులు, ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. వ్యవసాయం పండుగలా మారడంతో పని చేయగలిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి లభిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ వర్గాన్ని వదలకుండా వృత్తిదారులకు గొర్రెలు, చేపలు ఉచితంగా పంపిణీ చేయగా నాయీబ్రాహ్మణులు, రజకులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితరాలతో వారి జీవితాల్లో నూతనోత్తేజం వస్తున్నది.
మారనున్న జీవనం..
ఇప్పటి వరకు ఇతరులపై ఆధారపడి జీవితం గడిపిన దళితులు దళిత బంధు పథకంతో ఓనర్లుగా మారిరి వారి జీవన చిత్రాన్ని మార్చుకోబోతున్నారు. తిరుమలగిరి మండలంలో 2500 దళిత కుటుంబాల్లో 10 శాతం కూడా ప్రభుత్వ ఉద్యోగులు లేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త విద్యనభ్యసించిన వారు ఇప్పుడిప్పుడే సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగాలు పొందుతుండగా దాదాపు 85శాతం మంది కూలీనాలి పనులే చేసి జీవనం గడుపుతున్నారు. మార్కెట్లో హమాలీలు, ఆటోలు నడపడం, పండ్లు, ఇతర తోపుడు బండ్లతో ఉపాధి పొందుతున్నారు. మరికొంత మంది దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటుండగా అత్యధికంగా వ్యవసాయ కూలీలుగా బతుకు వెళ్లదీస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వబోయే దళిత బంధు పథకంతో తామే స్వతహాగా పనులు చేపట్టి మరో కొంత మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు చేసుకుంటామని పలువురు దళిత యువకులు ధీమాతో చెబుతున్నారు. ఇప్పటికే దళితులకు గేదెల పంపిణీ, ఎస్సీ గురుకులాలు, ఎస్సీ స్టడీ సర్కిళ్లు, కార్పొరేషన్ రుణాలు వంటివి ఇచ్చి వారి సంక్షేమానికి పాటుతుండగా ఈ కొత్త పథకం అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
దళిత దేవుడు సీఎం కేసీఆర్
నిరుపేద దళిత బిడ్డల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బందు పథకానికి శ్రీకారం చుట్టి దళితోద్ధరణ పితగా మారారు. తరతరాలుగా వెనుకబాటుకు గురై సమాజంలో చిన్నచూపుకు గురైన దళితులు నేడు ఆత్మగౌరవంతో జీవించేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. తిరుమలగిరి మండలానికి దళితబంధు పథకం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత ప్రజల పాలిట దేవుగా నిలిచారు. గత పాలకులు దళితులను ఓటు బ్యాంకుగానే చూశారు.. దళిత బంధు పథకాన్ని ప్రకకటించగానే ప్రతిపక్షాల పునాదులు కదులుతున్నాయి. నేడు దేశం మొత్తం కదిలిపోతున్నది. రాజకీయ పార్టీల్లో అలజడులు నెలకొంటున్నాయి. తన నియోజకవర్గానికి ప్రాధాన్యతనిచ్చి తిరుమలగిరి మండలానికి దళితబందు పథకం అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-గాదరి కిశోర్‌కుమార్, ఎమ్మెల్యే,
తుంగతుర్తి 2,500 దళిత కుటుంబాలు
తిరుమలగిరి మండలంలో సుమారు 2500 కుటుంబాలకు దళిత బంధు పథకం వర్తించే అవకాశం ఉన్నది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చేసిన లెక్కలకు తోడు తదనంతరం పెరిగిన జనాభా ప్రకారం ఈ మండలంలో సుమారు 12,500 కుటుంబాలకుగాను 45వేల జనాభా ఉంది. ఇందులో 2500 దళిత కుటుంబాలకు గాను 9850 మంది జనాభా ఉన్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. అన్ని కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున దళిత బంధు డబ్బులు అందనున్నాయి.
రక్తపాతాల నేలపై సంతోషాలు
దశాబ్దాల తరబడి తుంగతుర్తి నియోజకవర్గం కక్ష్యలు, కార్పణ్యాలకు పెట్టింది పేరు. నియోజకవర్గం నుంచి గెలిచిన పాలకులు గతంలో గొడవలతో రక్తపాతం సృష్టించారు తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదు. స్థానిక సమస్యలను నీరు గార్చారు. కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి భూములను సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేయలేదు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలనే ఆలోచనే చేయలేదు. ప్రజలు చేసేందుకు పనులు లేక, తినేందుకు తిండి దొరక్క అల్లాడి పోయారు. సమాజంలో అట్టడుగున ఉండి ఆపన్న హస్తం కోసం ఎదురు చూసిన దళితుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వారిలో ఒకరైన గాదరి కిశోర్‌కుమార్ వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ఆధ్వర్యంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహాకారంతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. ప్రస్తుతం నాటి ఘర్షణలు మచ్చుకు కూడా కనిపించకుండా చేశారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో పంటలుపచ్చబడి రైతులు, ప్రజలు సంతోషంగా ఉంటున్నారు.