గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అటవీ భూమి అన్యాక్రాంతమైంది. కబ్జాకోరల్లో చిక్కుకొని వేల ఎకరాలు మాయమైంది. ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకొని ఉన్న భూమిని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం నిధులు కేటాయించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తున్నది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 33 బ్లాకుల్లో 27వేల ఎకరాల అటవీ భూమి 250 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇప్పటికే రూ.10 కోట్లతో 50 కిలోమీటర్ల ఫెన్సింగ్ పూర్తి చేయగా నాలుగేండ్లలో దశలవారీగా పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక హరితహారంలో భాగంగా ప్రతి సంవత్సరం అటవీ భూముల్లో పెద్దసంఖ్యలో మొక్కలు నాటుతుండగా పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
సూర్యాపేట, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : దశాబ్దాల తరబడి భూబకాసురులు ప్రైవేట్ భూములను ఆక్రమించి పేద, మధ్య తరగతి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న విషయం విదితమే. ప్రైవేట్ భూముల పరిస్థితి ఇలా ఉంటే, ఇక ప్రభుత్వ భూముల కబ్జాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఆలయాలు, వక్ఫ్ భూములతోపాటు ప్రభుత్వ భూములైతే చాలాచోట్ల అనవాళ్లు కూడా లేకుండా దొరికిన కాడికి ఆక్రమిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో భూ రికార్డుల ప్రక్షాళన, క్రమబద్ధీకరణ పేరిట చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. దశాబ్దాల తరబడి ఎలాంటి పత్రాలు లేకుండా, వివాదాలతో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల భూ సమస్యలను దాదాపు 99శాతం పరిష్కరించారు. అలాగే గ్రామాల్లో ప్రభుత్వ భూముల సంరక్షణ, ఆక్రమణల నుంచి రక్షించడం జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, సెగ్రిగేషన్ షెడ్లు, మెగా పల్లె ప్రకృతి వనాలు తదితరాలకు చాలా చోట్ల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి చేపడుతున్నారు. దీనికితోడు మూడేళ్లుగా అటవీ భూముల సంరక్షణకు చర్యలు చేపడుతున్నది.
మూడేళ్లలో అంటే 2018 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 40 కిలోమీటర్ల మేర అటవీ భూములకు ఇనుప కంచె ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అటవీ భూములకు సంబంధించి 33 బ్లాకుల్లో రికార్డుల పరంగా 27వేల ఎకరాలు ఉంది. అయితే ఇందులో ఎంత అన్యాక్రాంతం అయిందో తెలియాల్సి ఉంది. బ్లాకుల వారీగా అటవీ శాఖ ఆధ్వర్యంలో భూముల సర్వే చేపడుతూ కొలతలు వేసి కబ్జాల నుంచి వెలికితీసి ఇనుప కంచె అమర్చుతున్నారు. ఆత్మకూర్.ఎస్ మండలం కందగట్ల గ్రామంలో దాదాపు 27 ఎకరాల వరకు కబ్జాలో ఉండగా వెలికితీసి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలాగే నడిగూడెం, రాఘవాపురం, చింత్రియాలలో పూర్తిస్థాయిలో ఇనుప కంచె వేయగా ఉండ్రుగొండలో కొంతమేర ఫెన్సింగ్ చేశారు.
రాబోయే నాలుగేళ్లలో జిల్లాలోని మొత్తం 27వేల ఎకరాల చుట్టూ పకడ్బందీగా ఇనుప కంచె వేసేందుకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం 250 కిలోమీటర్లకు ప్రస్తుతం రూ.10 కోట్ల వ్యయంతో 50 ఎకరాలు పూర్తి కాగా వంద శాతం పూర్తి చేసేందుకు సుమారు మరో రూ.40 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంది. ప్రతి ఏటా ఆన్లైన్ టెండర్ ద్వారా పనులు దక్కించుకునే కాంట్రాక్టర్లు ఫెన్సింగ్ పూర్తి చేస్తారు. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో ప్రైవేట్ భూముల వివాదాలు సమసిపోగా ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు. అలాగే అటవీ భూముల సంరక్షణ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఫెన్సింగ్ చేస్తుండడంపై భవిష్యత్లో ఇంచు భూమి కూడా కబ్జాకు గురికాకుండా ఉంటుంది.
జిల్లాలోని 33 బ్లాకుల్లో అటవీ భూముల చుట్టు కొలత 250 కిలోమీటర్లు ఉండగా మూడేళ్లుగా కంపా నిధులతో ఇనుప కంచె వేయిస్తున్నాము. కొన్నిచోట్ల కబ్జా జరిగినట్లు గుర్తించగా వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం. వచ్చే నాలుగేళ్లలో వంద శాతం అటవీ భూముల సంరక్షణ కోసం ఫెన్సింగ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.
-ముకుందరెడ్డి, జిల్లా అటవీ శాఖధికారి, సూర్యాపేట