
సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 30 : మండల కేంద్రంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లు, షాపులు, దేవాలయాలను ఎంచుకొని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాలు పని చేయక పోవడం వల్ల రాత్రి వేళల్లో నిఘా కొరవడుతున్నది.
ఆరు చోట్ల చోరీ
సంస్థాన్‌నారాయణపురంలో డిసెంబర్లోనే ఆరు దొంగతనాలు జరిగాయి. ఈ నెల 7న ఇటుక బట్టి వద్ద ఉన్న ఇంట్లో దొంగలు చొరబడి నగదు, నగలు దోచుకెళ్లారు. 8న బైక్ మెకానిక్ షాపులో రూ.30 వేల విలువగల వస్తువులను ఎత్తుకెళ్లి వావిళ్లపల్లి గ్రామ సంతలో అమ్ముతుండగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు.11న చిలువేరు సోమయ్యకు చెందిన పశువుల కొట్టంలో కట్టేసిన రెండు మేకలను ఎత్తుకెళ్లారు. 22వ తేదీన చెల్క ముత్యాలమ్మ గుడిలోకి చొరబడి చోరీకి పాల్పడుతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 28న రాత్రి కంఠమహేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడి నూనె డబ్బాలు, ఇత్తడి వస్తువులు ఎత్తుకెళ్లారు. రాత్రి వేళల్లో తమ పొలాల వద్ద పడుకున్న రైతుల సెల్ఫోన్లు సైతం ఎత్తుకెళ్తుండడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు.
పని చేయని సీసీ కెమెరాలు
మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తన నిధులు రూ.8 లక్షలతో 22 సీసీ కెమెరాలను కొనుగోలు చేసి పోలీస్‌శాఖకు అప్పగించారు. పోలీసులు వాటిని మండల కేంద్రంలో పలుచోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏడాది కాలంగా సీసీ కెమెరాలు పని చేయడం లేదు. అయినా పోలీసులు పట్టించుకోక పోవడంతో దొంగలు రెచ్చి పోతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సీసీ కెమెరాలను బాగు చేయించాలని, రాత్రి వేళల్లో నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇద్దరు దొంగలను జైలుకు పంపించాం
సంస్థాన్‌నారాయణపురంలో నెల రోజులుగా వరుస దొంగతనాలు జరిగిన మాట వాస్తవమే. చెల్క ముత్యాలమ్మ గుడిలో చోరీకి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాం. చోరీ చేసిన వస్తువులను రికవరీ చేస్తున్నాం. మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాం. పెట్రోలింగ్ వాహనాలతో 24 గంటలు గస్తీ కాస్తున్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరంలేదు. కోతుల బెడద కారణంగా సీసీ కెమెరాలు తరుచూ పనిచేయడం లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం.
-వెంకటయ్య, సీఐ చౌటుప్పల్