భద్రాచలం, డిసెంబర్ 22: భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం స్థానంలో టీఆర్ఎస్ను గెలిపించేందుకు శ్రేణులంతా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. బుధవారం భద్రాచలంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ తాను చట్టసభలో ప్రవేశించడానికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు, తాను విజయం సాధిస్తావని భరోసా ఇచ్చిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు, తన విజయానికి అహర్నిశలూ కృషి చేసిన మంత్రి అజయ్‌కుమార్, మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, పార్టీ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తన విజయం పార్టీ విజయమని అన్నారు. ఐకమత్యంగా ఉంటేనే ఏ విజయమైనా సాధ్యమవుతుందని, శ్రేణులు మధ్య ఐక్యత పెంచేందుకు కృషి చేస్తానని అన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో సందర్భంలో అవకాశం వస్తుందని, ఎవరూ నిరుత్సాహ పడవద్దని అన్నారు. సమస్యలేమైనా ఉంటే తొలుత ఇన్చార్జుల దృష్టికి తీసుకెళ్లాలని, అక్కడ పరిష్కారం కాకుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం పోడు భూములు, ఏపీలో విలీనమైన 5 పంచాయతీలు, రామాలయం అభివృద్ధి వంటి సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ఇప్పటికే వీటిపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారని వివరించారు. అనంతరం పలువురు నేతలు ఎమ్మెల్యే తాతా మధును సన్మానించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, నేతలు అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, రత్నం రమాకాంత్, నర్రా రాము, చింతాడి చిట్టిబాబు, రామకృష్ణ, బొల్లా రాంబాబు, తిప్పన సిద్ధులు, కోటగిరి ప్రభోద్కుమార్, తాళ్ల రవికుమార్, పడిశిరి శ్రీనివాస్, గూడపాటి శ్రీను, లకావత్ వెంకటేశ్వర్లు, మామిళ్ల రాంబాబు, చుక్కా సుధాకర్, దుమ్ముగూడెం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి, కణితి రాముడు, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిథులు, నాయకులు పాల్గొన్నారు.
రామయ్యను దర్శించుకున్న తాతా మధు..
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని ఎమ్మెల్సీ తాతా మధు బుధవారం దర్శించుకున్నారు. రామాలయానికి వచ్చిన ఆయనకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలోని మూలమూర్తుల వద్ద తాతా మధు ప్రత్యేక పూజలు చేశారు.