నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 30 : జిల్లాలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అల్లర్లు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ముందస్తు కార్యాచరణతో రంగంలోకి దిగారు. నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ కేఆర్ నాగరాజు హెచ్చరించారు. పటాకులు కాల్చడం, ఆర్కెస్ట్రా, డీజేను నిషేధించినట్లు ఆయన తెలిపారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని రోడ్లపైకి వచ్చే ప్రతి వాహనాదారుడూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సివిల్, స్పెషల్ పార్టీ బలగాలు రోడ్లపై ప్రత్యేక తనిఖీలతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను సైతం నిర్వహిస్తాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారి వివరాలను ఫొటో, వీడియో ద్వారా రికార్డ్ చేసి వారిపై కేసులు నమోదు చేస్తాయని తెలిపారు.
ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించి సహకరించాలని సీపీ కోరారు. ప్రజలు తమ ఇండ్లల్లోనే కుటుంబసభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సీపీ కోరారు.
బహిరంగ ప్రదేశాలో మద్యం సేవించేవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మైనర్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.