బీర్కూర్, డిసెంబర్ 11 : చిన్న పాటి విషయం లో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన సజ్జాద్ (బ్యాంకులో అటెండర్) ఇల్లు నిర్మించుకుంటున్నాడు. విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా స్తంభం నుంచి కనెక్షన్ తీసుకొని కొత్త ఇంటి నిర్మాణానికి వాడుకుంటున్నాడని, అదే కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సల్మాన్(సల్లు) ఫిర్యాదు చేశాడని సజ్జాద్ అనుమానించాడు. దీంతో సల్మాన్‌ను సజ్జాద్ శనివారం సాయంత్రం పిలిచి మందలించాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న సల్మాన్ తనకు పరిచయం కలిగిన కొంత మందిని బాన్సువాడ నుంచి పిలిపించి సజ్జాద్ ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. కత్తులతో దాడి చేయగా సజ్జాద్, అస్లామ్, ఫయాజ్, అలీమ్, సిరాజ్‌తో పాటు బాన్సువాడకు చెందిన మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. అస్లామ్ అనే యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, ఆయనను బాన్సువాడ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి బాన్సువాడ రూరల్ సీఐ చంద్రశేఖర్ చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బీర్కూర్ ఏఎస్సై నాగభూషణం శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.