
మహబూబ్‌నగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పెద్దపీట వేస్తామని నా రాయణపేట నూతన ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. న్యాయం కోసం వచ్చే వారికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని.. దుర్మార్గాలకు పాల్పడే వారిపై అత్యంత కఠినంగా ఉంటామని హెచ్చరించారు. అన్యాయానికి గురైన ప్రజలకు అండగా ఉంటామన్నారు. కర్ణాటకతో సరిహద్దును పంచుకునే నారాయణపేట జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని.. ఇక్కడి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ శాంతియుత వాతావరణాన్ని కొనసాగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తొలిసారి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.వెంకటేశ్వర్లు మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
నమస్తే తెలంగాణ : అక్రమార్కులతో ఎలా వ్యవహరిస్తారు..?
ఎస్పీ వెంకటేశ్వర్లు : ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటేనే తెలంగాణ పోలీసులు అనేలా మా పనితీరు ఉంటుంది. అమాయక ప్రజలకు, న్యాయం కోసం వచ్చే వారికి ఫ్రెండ్లీ పోలీసింగ్గానే ఉంటాం. కానీ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించాం. కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ వ్యవహారాలు, రౌడీయిజం చేసే వారిపై ఉక్కుపాదం మోపుతాం. పోలీసులకు సహకరించి చట్టవ్యతిరేక కార్యక్రమాలపై సమాచారం ఇచ్చే వారిని కాపాడతాం. జిల్లాలో శాంతిని నెలకొల్పేందుకు అందరి సహకారంతో ముందుకువెళ్తాం. పోలీసులు సైతం ప్రజలకు సరైన విధంగా ప్రవర్తించేలా జాగ్రత్తలు తీసుకుంటాం.
పోలీసుల వద్దకు రావాలంటేనే సామాన్యులు భయపడుతున్న పరిస్థితి అక్కడక్కడా కనిపిస్తున్నది. స్థానికంగా ఎవరైనా పలుకుబడి ఉన్న వారిని తీసుకొచ్చే పరిస్థితి గమనిస్తాం. ఫిర్యాదుదారులకు
ఎలాంటి భరోసా ఇస్తారు.?
ఎస్పీ వెంకటేశ్వర్లు : పోలీసుల వద్దకు వచ్చే వాళ్లకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. పోలీసులు ఉన్నదే ప్రజాసేవ కోసం. అందుకే న్యాయం ఆశించి వచ్చే వారికి పోలీసులు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతారు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం తప్పేమీ కాదు. అవసరమైనప్పుడు పోలీసుల సాయం తప్పక తీసుకోవాలి. పలుకుబడి ఉన్న వారిని తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందనే భ్రమ వీడండి. ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటా. అన్యాయానికి గురైన వారికి న్యాయం అందించడమే మా ప్రథమ కర్తవ్యం.
ప్రతివారం ప్రజావాణి కార్యక్రమంతో పాటు ప్రజలకు చేరువయ్యేందుకు ఏమైనా ఆలోచనలున్నాయా..?
ఎస్పీ వెంకటేశ్వర్లు : ప్రజలకు మరింత చేరువవుతా. అన్ని పోలీస్స్టేషన్లు తిరిగి అక్కడి పరిస్థితులను, సమస్యలను తెలుసుకుంటాం. జిల్లాలోని 8 మండలాలు కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటాయి. కాబట్టి సరిహద్దులపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉన్నది. గతంలో బోధన్‌లో పనిచేశాను. అక్కడ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నట్లే ఇక్కడా పనిచేస్తాం.
బాల్యవివాహాలు, మహిళా సమస్యలు, బాలకార్మికవ్యవస్థ నిర్మూలనకు ఎలాంటి చర్యలు
తీసుకుంటారు..?
ఎస్పీ వెంకటేశ్వర్లు : నారాయణపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గతంలో బాల్య వివాహాలు జరిగేవి. ఇప్పుడు దాదాపుగా ఆ పరిస్థితి తగ్గింది. అయినా వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. బాల్యవివాహాలను అడ్డుకుంటాం. మహిళలు తమ సమస్యలపై పోలీస్‌లకు నిర్భయంగా వచ్చి ఫిర్యాదు చేసేలా వారికి అవగాహన కల్పిస్తాం. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు మా వంతు పాత్ర పోషిస్తాం. బాలకార్మికులను పనిలో పెట్టుకునే వారిపై చట్టరీత్యా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం.
అమాయకులు సైబర్ క్రైం మోసాలకు గురవుతున్నారు. దీనిపై మీ కార్యాచరణ..?
ఎస్పీ వెంకటేశ్వర్లు : అమాయక ప్రజలను మోసం చేసేందుకు కొందరు సైబర్ నేరగాళ్లు పొంచి ఉంటారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తా. ప్రత్యేకంగా కళాజాత బృందాలను వినియోగించుకొని సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా చూస్తాం. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ, పిన్ నెంబర్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు..
సరిహద్దు జిల్లా కావడంతో కర్ణాటక, తెలంగాణ మధ్య కొన్ని అక్రమ వ్యాపారాలు గుట్టుగా సాగుతుంటాయి. రేషన్ బియ్యం, ఇసుక
తరలింపు, మత్తు పదార్థాల సరఫరా అడ్డుకునేందుకు ఏం చేస్తారు.?
ఎస్పీ వెంకటేశ్వర్లు : గుట్కా, జూదం, గంజాయిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ దందాలో ఉన్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలించాలని చూస్తే రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తాం. సరిహద్దులో భద్రత, తనిఖీల కోసం అవసరమైన చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. నారాయణపేట జిల్లా పరిధిలోని ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.