కాలగమనంలో మరో ఏడాది గడిచిపోయింది.. మరో కొది గంటల్లో 2021 కాలగర్భంలో కలిసిపోతుంది.. 2022 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న తరుణాన.. ఒక్కసారి వెనక్కి తిరిగిచూస్తే ప్రతి ఒక్కరినీ సుఖదుఃఖాల యాది కదిలిస్తుంది. ఈ యేడాది కూడా కరోనా భయం వెంటాడినా.. టీకాస్త్రంతో మహమ్మారి చాలా వరకు కట్టడి అయింది. సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర సర్కారు ఎప్పటిలాగే మానవీయ కోణాన్ని చూపింది. ఎక్కడా వెనక్కి తగ్గకుండా సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది. పథకాలను యథావిధిగా అమలు చేస్తూనే, దేశ చరిత్రలోనే నిలిచిపోయేటువంటి కొత్త స్కీంలకు శ్రీకారం చుట్టింది. దళితుల తలరాతలు మార్చే సంకల్పంతో హుజూరాబాద్ గడ్డపై ‘దళితబంధు’ను ప్రారంభించింది. ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టించింది. కరీంనగర్‌కు కొత్త కలెక్టరేట్‌ను మంజూరు చేసి, ఈ నెల 29న పనులకు అంకురార్పణ చేసింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది.
బడి తెరుచుకున్నది..
కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో మూతబడ్డ స్కూళ్లను దాదాపు పది నెలల తర్వాత పునఃప్రారంభించారు. సెప్టెంబర్ ఒకటిన స్కూళ్లు తెరుచుకోగా, కరోనా నిబంధనల మధ్యన విద్యార్థులంతా బడిబాట పట్టారు.
విజయ సారథికి విశిష్ట పురస్కారం
సంస్కృత సాహితీవేత్త, శతాధిక గ్రంథ కర్త, మహామహోపాధ్యాయ శ్రీభాష్యం విజయ సారథికి అక్టోబర్ 16న పద్మశ్రీ వరించింది. నవంబర్ 8న ఢిల్లీలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
టీఆర్ఎస్ విజయభేరి
ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నవంబర్ 16న నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబర్ 10న ఎన్నిక జరిగింది. 14న ఓట్ల ఫలితాలను వెల్లడించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు టీ భానుప్రసాద్‌రావు, ఎల్ రమణ విజయభేరి మోగించారు.
నవ శకానికి నాంది
ముఖ్యమంత్రి కేసీఆర్ జూలై 4న సిరిసిల్లలో పర్యటించి, నవశకానికి నాంది పలికారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి డబుల్ బెడ్రూం ఇండ్లు, ఐడీటీఆర్, మోడ్రన్ మార్కెట్ యార్డు, నర్సింగ్ కాలేజీ, సమీకృత కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేశారు.
మూడోసారి సారథ్యం..
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మూడోసారి రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమితులయ్యారు. జూలై 13న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తర్వుల కాపీని అందుకున్నారు.మానేరు తీరం.. శోకసంద్రంసిరిసిల్లలోని మానేరువాగుకు నవంబర్ 15న ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు.
అవినీతి మరకలు
ఈ యేడాది పలువురు అధికారులు, ఉద్యోగులు అవినీతి మరకలు అంటించారు. పెద్దపల్లి ఆర్డీవో, రామగుండం ఇన్చార్జి కమిషనర్ శంకర్‌కుమార్ నవంబర్ 30న ఏసీబీకి చిక్కారు. రామగుండం కార్పొరేషన్లో పలు పనుల బిల్లుల చెల్లింపునకు కాంట్రాక్టర్ వద్ద తన ఇంట్లో పనిచేసే వ్యక్తి ద్వారా రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
కరీంనగర్‌కు కొత్త కలెక్టరేట్
కరీంనగర్లో కొత్త సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.51కోట్లు కేటాయించారు. డిసెంబర్ 29న మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు. జీ ప్లస్ 2 పద్ధతిలో 2,64,062 చదరపు అడుగుల్లో ఉండేలా డిజైన్ చేశారు.
‘దళిత బంధు’వు..
దళితుల తలరాతలు మార్చే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆగస్టు 9న దళిత బంధును ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, నియోజకవర్గంలోని 20వేలకు పైగా ఉన్న కుటుంబాలకు ఇంటికీ రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు తొలివిడుతగా రూ.500 కోట్లు విడుదల చేశారు. ఆగస్టు 16న శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా పథకాన్ని ప్రారంభించి, తొలి విడుత 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. పథకంలో భాగంగా సెప్టెంబర్ 3 నుంచి వేలాది మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేయడం ప్రారంభించారు.
ఎస్బీఐలో.. భారీ చోరీ
మంథని మండలం గుంజపడుగు ఎస్బీఐలో మార్చి25న భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కీలో స్కెచ్ వేసి, రూ.18.46 లక్షల నగదు, రూ.2.90కోట్ల విలువైన ఆరు కేజీల బంగారాన్నిదోచుకెళ్లారు. ఈ చోరీ రాష్ట్రంలోనే సంచలనం రేపగా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితులను గుర్తించి కటకటాలకు పంపించారు.
డిస్కవరీలో ‘కాళేశ్వర దృశ్యం’
ప్రఖ్యాత డిస్కవరీ చానల్లో ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతపై జూన్ 25న డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం, నీటి తరలింపు, సర్కారు కృషిపై తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా ఆరు ప్రాంతీయ భాషల్లో గంటపాటు టెలీకాస్ట్ చేసింది.
మన యూరియా వచ్చిందోచ్..
దక్షిణాది రాష్ర్టాల ఎరువుల కొరత తీర్చడమే లక్ష్యంగా రామగుండంలో నిర్మించిన ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీలో ఫిబ్రవరి 28న తొలి సారి ట్రయల్ రన్ నిర్వహించారు. రాత్రి 2:30 గంటల సమయంలో అధికారులు ట్రయల్ రన్ చేసి దిగ్విజయంగా యూరియా
ఉత్పత్తి చేశారు. తొలి ఉత్పత్తి 30 టన్నుల యూరియాను టీటీడీకి విరాళంగా పంపించిన అధికారులు, మార్చి 29న కరీంనగర్ వాణిజ్య మార్కెట్లోకి 450 బస్తాలను పంపించారు.
లాక్డౌన్ 2.0
కరోనా సెకండ్ వేవ్‌లో భాగంగా వైరస్ కట్టడికి సర్కారు మే11న లాక్డౌన్ ప్రకటించింది. ఉదయం 4 గంటలపాటు.. సాయంత్రం 4 గంటలపాటు ఆంక్షలు విధించింది. నైట్ కర్ఫ్యూతో మహమ్మారికి చెక్‌పెట్టింది. నిబంధనలు అతిక్రమించినవారికి జరిమానా విధించింది.
నేలకొరిగిన క్రీడా శిఖరం
అంతర్జాతీయ పారాఒలింపిక్ దిగ్గజం అర్జున అవార్డు గ్రహీత శ్రీనివాసరావు మార్చి18న అనారోగ్యంతో కన్నుమూశారు. జన్మతః దివ్యాంగుడైనా.. ఆటే శ్వాసగా విశ్వక్రీడా యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన ఆయన, తుదకు క్యాన్సర్ మహమ్మారితో ప్రాణాలు ఒదిలారు.
ఇయర్ రౌండప్..
కరోనా మహమ్మారి నివారణకు తీసుకొచ్చిన టీకా
డ్రైరన్‌ను జనవరి 9న ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు. 99 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి సెంటర్లో 25 మందికి డమ్మీ టీకా వేశారు. జనవరి 16న మొదటిసారిగా వ్యాక్సినేషన్ ప్రారంభించారు.