మణుగూరు రూరల్, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతోందని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదని గుర్తుచేశారు. రాష్ట్ర రైతుల ధాన్యం కొనుగోలు చేయనందుకు నిరసనగా, ‘ఊరూరా చావు డప్పు’ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మణుగూరులో సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ.. తెలంగాణలో సాగునీటి వనరులు పెరగడం, రైతులకు పెట్టుబడి సాయం అందడం వంటి కారణాలతో పంట దిగుబడులు పెరిగాయని అన్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టడం సరికాదని, రైతులకు అన్యాయం చేసినట్లవుతుందని అన్నారు. ఈ నిరసనలు ఇక్కడితో ఆగవని, జనవరిలో అన్ని నియోజకవర్గాల్లో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టి ఢిల్లీకి వెళ్తామని అన్నారు. కేంద్రంలో బీజేపీ మెడలు వంచి అయినా రైతులకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని అన్ని పంచాయతీల్లోనూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు, అధికారులకు వినతిపత్రాల అందజేతలు వంటి కార్యక్రమాలు జరిగాయి. నాయకులు అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, రామిరెడ్డి, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, సాగర్, సకినిబాబురావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
అశ్వాపురంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నేతలు పాల్గొన్నారు.