
ప్రభుత్వం వరికి బదులు ఇతర పంటల సాగు వైపు దృష్టి సారించింది. ఇందుకోసం వివిధ పంటలు
సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నది. దీంతో వ్యవసాయ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అన్నదాతలకు పంటల మార్పు, సాగు విధానంపై సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నారు. కాగా సీఎం కేసీఆర్ సూచనతో మక్తల్ ఎమ్మెల్యే తన వ్యవసాయ క్షేత్రంలో చెరుకు పంట సాగు చేయాలని నిర్ణయించారు. మిగతా వారు ఇదే బాటలో నడవాలని 13వ తేదీన 3 వేల మంది రైతులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఆరుతడి పంటల సాగుకు కర్షకులు ఆసక్తి చూపుతున్నారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : కేంద్రం ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నది. దీంతో రైతు లు ఏ పంటలు వేసుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వరికి బదులు ఇతర పంటలు సాగుచేస్తేనే భవిష్యత్ ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం రైతులకు స్ప ష్టంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్లు, వ్యవసాయాధికారులు పొలాల వద్దకు వెళ్లడంతోపాటు రైతువేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఇతర పం టల ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఏ భూముల్లో ఏ పంటలు వే యాలో చెబుతున్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతులు ఎక్కువగా ఉన్న వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. తానే ముందుగా పంట మార్పిడి చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలిచారు. అంతే కాకుండా తన సొంత ఖర్చులతో సుమారు 3 వేల మంది రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జి ల్లాలో పంట మార్పిడి కోసం అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అన్నదాతల నుంచి సైతం చక్కని స్పందన వస్తున్నది.
పంట మార్పిడి సాధ్యమే..
చాలా మంది రైతులు తమ భూముల్లో వరి తప్పా వేరే పంట లు పండవని అనుకుంటున్నారు. అయితే, అది వాస్తవం కాదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. చౌడ భూముల్లో తైదలు, ఉసిరి వేయొచ్చని పేర్కొంటున్నారు. మరోవైపు వరి తప్పా వేరే పంటలు పండవని భావించే బురద పొలాల్లో అరటి, చామగడ్డతోపాటు మెడిసినల్ క్రాప్స్ అయిన వజ, బ్రహ్మి తదితర వాటితో చక్కని లాభాలు పొందవచ్చంటున్నారు. ఈ విషయాల్లో సందేహాలుంటే సమీప వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వరికి బదులుగా సాధారణ నేలల్లో పెసర, మినుములు, నువ్వులు, పొద్దుతిరుగుడు, పెబ్బర్లు, జొన్నలు, మిల్లెట్స్ బాగా పండుతాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేలలు ఇందుకు అనుకూలంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతా ల్లో రైతులు పంట మార్పిడి చేస్తున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి, పంచలింగాల తదితర చోట్ల వరి బాగా పండించే గ్రామాల్లో ప్రస్తుతం వేరుశనగ సాగు పెరిగింది.
మెడిసినల్ ప్లాంట్స్‌తో లాభాలు..
ఉమ్మడి జిల్లా రైతులు ఇతర పంటలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అనేక అవకాశాలున్నాయని వ్యవసా య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు పెద్దగా సాగు చేయని మెడిసినల్ ప్లాం ట్స్‌తో అధిక లాభాలు పొందొచ్చంటున్నారు. నారాయణపేట జి ల్లాలో ప్రయోగాత్మకంగా సెరా ట్రస్ట్ ఆధ్వర్యం లో కొంత ప్రాంతంలో మెడిసినల్ ప్లాంట్స్ పండించాలని ప్రయత్నిస్తున్నారు. కొవిడ్ తర్వాత మెడిసినల్ క్రాప్స్‌కు ఊహించని డిమాండ్ ఏర్పడింది. విదేశాలకు ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి. వజ, బ్రహ్మి, అశ్వగంథ, సర్పగంథ తదితర పంటలు పండిస్తే తప్పనిసరిగా బైబ్యాక్ ఉంటుంది. సెరా ట్రస్ట్ వాళ్లే కాకుండా వివిధ కంపెనీలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు తెలిపారు.
ఎమ్మెల్యే చిట్టెం కృషి..
వరి బదులు ఇతర పంటలు పండించాల ని కలెక్టర్లు, అధికారులు రైతుల కు వివరిస్తున్నారు. ఈ తరుణంలో నియోజకవర్గంలోని రైతులకు అవగాహన కల్పించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఈ నెల 13న మక్తల్ మండల కేంద్రంలోని ద్వారకా గార్డెన్ ఫంక్షన్ హాల్లో సూమారు 3 వేల మంది రైతులను ఆహ్వానించారు. లాభసాటి పంటలపై వ్యవసాయ రంగ నిపుణులతో అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితోనే ఇతర పంటల ప్రాధాన్యాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
చెరుకు సాగుకు సిద్ధమయ్యా..
‘వరి వేస్తే.. ఉరే’అనే విషయం రైతులతోపాటు మాకు కూ డా వర్తిస్తుంది. అం దుకే ఈ సారి వరి బదులు 10 ఎకరా ల్లో చెరుకు పండించేందుకు సిద్ధమయ్యాను. కర్ణాటకలోని సైదాపూర్ చెరుకు ఫ్యాక్టరీతో మాట్లాడి ఏర్పాట్లు చేసుకున్నాను. వరి పండించి ఆగమయ్యే బదులు మంచి లాభాలు వచ్చే చెరుకు మేలని నిర్ణయించుకున్నాను. 10 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేశాను. అంతర పంటగా కూరగాయలు పండించేదుకు ఏర్పాట్లు చేస్తున్నాను. నేను ఆయిల్‌పాం వేశాక నియోజకవర్గంలో సుమారు 2 వేల ఎకరాలకు పైగా సాగు పెరిగింది. రైతులకు అర్థమయ్యేలా వివరిస్తే తప్పకుండా ఇతర పంటలపై దృష్టి సారిస్తారు. ఈ నెల 13న సొంత ఖర్చులతో సుమారు 3 వేల మంది రైతులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. అనుమానాలుంటే నివృత్తి చేస్తారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
26 వేల మందిని కలిశాం..
వరికి బదులు ఇ తర పంటలు పండించాలని ఇప్పటివరకు 26 వేల మంది రైతులను కలిశాం. రైతు వే దికల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏఈవోలు ఇతర పం టలతో కలిగే లాభాల ను వివరిస్తున్నారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా చూసేందుకు సి బ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రైతులూ సా నుకూలంగా స్పందిస్తున్నారు. గతేడాది 8 వేల ఎ కరాల్లో వేరుశనగ సాగుకాగా, ఈ ఏడాది 13 వేల ఎకరాలు దాటింది. మినుములు, పెబ్బర్లు, పెసర, నువ్వుల సాగు విస్తీర్ణం కూడా పెరుగుతున్నది. రైతులకు వరితో జరిగే నష్టాన్ని వివరిస్తున్నాం. చా లా చోట్ల గతంలో 10 ఎకరాల వరి వేసే చోట ఈ సారి మూడెకరాల్లో వేస్తామని రైతులు చెబు తున్నారు. వాస్తవాలను రైతులు అర్థం చేసుకుంటున్నారు. స్థానికంగానే నాణ్యమైన విత్తనాలు ల భ్యమయ్యేలా చూస్తున్నాం. పంట మార్పిడి ఇప్పటిది కాదు. వ్యవసాయ శాఖకు ఎప్పటి నుంచో ఉన్న విధానమిదే. అది వ్యవసాయ శాఖ బాధ్యత.