‘ఎనిమిది రాష్ర్టాల్లో రెండు వేల పరిశ్రమలు, రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు రవాణా.. సంస్థ కోసం కష్టపడి పనిచేసే కార్మికులు.. వేలాది మందికి కారుణ్య నియామకాలు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి.. అత్యాధునిక సాంకేతికత వినియోగం.. కరోనా సమయంలోనూ ఉత్పత్తి, రవాణా లక్ష్యాల ఛేదన..’ ఇదీ సింగరేణి ఘనత అని సంస్థ డైరెక్టర్ (పా) బలరాం అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో గురువారం నిర్వహించిన ‘సింగరేణి డే’లో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న సంస్థల్లో సింగరేణి ఒకటని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 23: సింగరేణి సంస్థ దేశ ప్రగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తోందని సింగరేణి డైరెక్టర్ (పా) ఎన్.బలరాం పేర్కొన్నారు. దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్ అవసరాలకు తగినంత బొగ్గు ఉత్పత్తి చేస్తూ జాతీయస్థాయిలో ప్రత్యేక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. సింగరేణి డే సందర్భంగా గురువారం రాత్రి కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో జరిగిన ప్రధాన వేడుకల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గులో 270 లక్షల టన్నులను తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నామన్నారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి ఎనిమిది రాష్ర్టాలకు కూడా సింగరేణి బొగ్గు సరఫరా అవుతోందన్నారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాల్లోని ఇనుము, సిమెంట్, సిరామిక్స్, ఎరువులు, మందులు, పేపర్ లాంటి రెండు వేల పరిశ్రమలకు మన బొగ్గు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. దేశాభివృద్ధికి మనం ఎంతగానో తోడ్పడుతున్నామన్నారు. నిరుడు కరోనా విపత్తులోనూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించామని, ఈ ఏడాది కూడా మిగిలిన మూడు నెలల కాలంలో నిర్దేశించిన లక్ష్యాన్ని సమష్టి కృషితో సాధిస్తామని అన్నారు. సింగరేణి చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, టర్నోవర్, లాభాలు సాధించాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే పరిస్థితులు రావొచ్చన్నారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు మనందరం సిద్ధంగా ఉండాలని, ప్రైవేటు కంపెనీలు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తుంటే ఆ దిశగా మన పని విధానాన్ని మార్చుకోవాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో కార్మికులకు సింగరేణి సంస్థ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా చేపట్టని విధంగా సింగరేణిలో సంక్షేమ పథకాలు అమలయ్యాయన్నారు. రూ.3.5 కోట్లతో ఐదు చోట్ల ఆక్సీజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, 12,553 మందికి కారుణ్య నియామకాలు కల్పించామని, 38 వేల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పించామని, సొంతింటికి రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణం అందించామని, ఇప్పటి వరకు 5200 మందికి రూ.52 కోట్లను కంపెనీ వడ్డీగా చెల్లించిందని వివరించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టానికి మణిహారంగా సింగరేణి సంస్థ నిలిచిందని అన్నారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులతో పరిసర ప్రాంతాల అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సంస్థలో అనేకమందికి ఉపాధి లభిస్తోందని అన్నారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలకే కాకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ.వెంకట్రావ్, ఏఐటీయూసీ నేత సీతారామయ్య, డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఈఅండ్ఎం సత్యనారాయణరావు, జీఎంలు ఆనందరావు, బసవయ్య, అన్ని విభాగాల జీఎంలు, అధికారులు, ఉద్యోగులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.