సిద్దిపేట/మిరుదొడ్డి/న్యాల్కల్, డిసెంబర్ 18 : నాలుగైదు రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీల వరకు పడిపోతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి చలి గాలులు వీస్తుండగా, రాత్రిపూట చలి పం జా విసురుతున్నది. ఇక, ఉదయం 9 గంటల వరకూ మంచు కమ్ముకుంటుండడంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, రైతులు, రోజువారీ కూలీలు పనులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. చలినుంచి రక్షణ పొందేందుకు స్వెట్టర్లు, మంకీక్యాప్స్, జర్కిన్, మఫ్లర్లు ధరిస్తున్నారు. దీంతో వీటి విక్రయాలు జోరందుకున్నాయి. సిద్దిపేట పట్టణం మెదక్ రోడ్లో మల్టీ పర్పస్ హై స్కూల్ ఎదురుగా, రూరల్ పోలీస్‌స్టేషన్ సర్కిల్, రంగధాంపల్లి సర్కిల్లో నూలు దుస్తువుల విక్రయ దుకాణాలు వెలిశాయి.
ఉన్ని, నూలు దుస్తులకు పెరిగిన గిరాకీ..
ప్రస్తుతం ఉన్ని, నూలు వస్ర్తాలకు గిరాకీ పెరిగింది, సిద్దిపేటలో నూలు, ఉన్ని దుస్తువుల విక్రయదారులు నేపాల్, పం జాబ్, రాజస్థాన్, కర్ణాటక తదితర ప్రదేశాల నుంచి వచ్చి స్థానికంగా దుకాణాలను ఏర్పాటు చేశారు. కరోనా ప్రభావంతో ట్రాన్స్‌పోర్టు ఇబ్బందితో ధరలు పెరిగాయని దుకాణాదారులు పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి చలి ఎక్కువగా ఉన్నట్టే అనిపిస్తున్నది. దీంతో చిన్నా, పెద్దా అంతా వెచ్చని నూలు, ఉన్నితో తయారు చేసిన దుస్తువులను ధరిస్తున్నారు.
పెరిగిన ధరలు
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉన్ని, నూలు దుస్తువుల ధరలు పెరిగాయి. దాదాపు 25 నుంచి 50 శాతం వరకు పెరిగినట్లు విక్రయదారులు చెబుతున్నారు. రగ్గులు నాణ్యతను బట్టి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అమ్ముతున్నారు. మహిళల స్వెట్టర్లు రూ.350 నుంచి రూ.700 వరకు ధర ఉండగా, మంకీక్యాప్ రూ.80 నుంచి రూ.100, మాస్కులు రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. అలాగే, శాలువాలు రూ. 250 నుంచి రూ.500, గ్లౌజులు రూ.80 నుంచి120, మఫ్లర్లు రూ.120 నుంచి 150 చిన్న పిల్లల స్వెట్టర్లు రూ.300 నుంచి 500, పురుషుల స్వెట్టర్లు రూ.250 నుంచి 1000, జర్కిన్లు రూ.500 నుంచి 1000 వరకు ధరలు పలుకుతున్నాయి.
చలికి జగ్రత్తలు..
చలి తీవ్రంగా ఉండడంతో జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, హృద్రోగులు ఇబ్బందులకు గురవుతారని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లక పోవడమే మంచిదని సూచిస్తున్నారు. చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు పోతే చల్లగాలులతో జలుబు, తలనొప్పి, చర్మ సమస్యలు వస్తాయని అంటున్నారు. గుండెజబ్బులు, ఆస్తమా ఉన్నవారు ఇంట్లో ఉష్ణోగ్రతలు పడిపోకుండా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. ఉదయం వేళల్లో మంచు కురుస్తుండటంతో వ్యక్తిగత వాహనాలు వినియోగించే ప్రయాణికులు వేకువజూమున కాకుండా తెల్లవారిన తర్వాత ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
సాయంత్రం వేళలో గిరాకీ
చలి తీవ్రత పెరగడంతో గిరాకీ ఎక్కువైంది. సాయంత్రం వేళలో కొనుగోళ్లు అధికంగా జరుగుతున్నాయి. వినియోగదారులకు కావాల్సిన అన్నిరకాల వెచ్చని దుస్తువులను అందుబాటులో ఉంచాం. స్వెట్టర్లు, మఫ్లర్లు, గ్లౌజ్‌లు, మంకీ క్యాప్‌లు, జర్కిన్లు, దుప్పట్లు, రగ్గులు, శాలువాలు తదితర ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరిగింది. గ్లౌజ్‌లు, మాస్క్‌ల కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
-బసవరాజు, దుకాణ యజమాని, సిద్దిపేట
చలి బాగా పెరిగింది..
నాలుగు రోజుల సంది చాలి బాగా పెరిగింది. వణుకు పుడుతున్నది. భరించలేక మంకీ క్యాప్, మఫ్లర్ కొనుకున్న. ఇక్కడ అన్నిరకాల వెచ్చని దుస్తులు దొరుకుతున్నాయి. ధరలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ, చలికి కొనక తప్పుతలేదు. మా ఇంట్లో అందరం స్వెట్టర్లు వాడుతాం. ఒకవేళ పొద్దుగాల లేస్తే మా గల్లీలోని అం దరం చలిమంట పెట్టుకుని వెచ్చదనం పొందుతాం.
-పద్మ , ముస్తాబాద్