
కాలక్షేపానికి కొందరు, పని ఒత్తిడి నుంచి విశ్రాంతి కోసం మరికొందరు.. వ్యవసాయ క్షేత్రాల్లో ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. ప్రత్యేకించి పట్టణాల్లో ఉంటూ వ్యవసాయం చూసుకుంటున్న వారు ప్రకృతి ఒడిలో జీవితం గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా కారణంగా ఈ కల్చర్ ఇటీవల మరింతగా పెరిగిపోయింది. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని పలు తోటల్లో ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది. తాత్కాలికంగా కాకుండా విలాసవంతమైన సౌకర్యాలతో భవనాలను తీర్చిదిద్దుతుండడం విశేషం.
మిర్యాలగూడ, డిసెంబర్ 9
వ్యాపారులు, ఉద్యోగులు వారాంతపు సెలవుల్లో సేద దీరేందుకు ఇష్టపడుతున్నారు. పట్టణాలు, నగరాల్లో వివిధ రకాల శబ్ద, వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న వారు పల్లె వాతావరణంలో గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయా వర్గాలకు చెందిన సంపన్నుల్లో కొందరు వ్యవసాయ భూములు కొని ఫాంహౌస్లు కట్టుకుంటున్నారు.
పెరిగిన ఫాంహౌస్ కల్చర్..
ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉండడంతో ఫాంహౌస్ కల్చర్ విస్తరిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీడు భూములు సైతం సాగులోకి రావడంతో వ్యవసాయ క్షేత్రాలు ఏర్పడ్డాయి. తోటల సాగు పెరిగింది. దాంతో బత్తాయి, పండ్ల తోటల సాగు చేపట్టిన సంపన్న రైతులు తోటల్లో గడిపేందుకు ఇష్టపడుతున్నారు.
భద్రతకు ప్రాధాన్యం…
తోటల్లో ఫాంహౌస్లు నిర్మించుకునే వారు ప్రహరీ లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. కాపలాదారుడిని పెట్టుకోవడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా తోటల్లో జరుగుతున్న పనులను నిత్యం పరిశీలిస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ వ్యవసాయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.
ఎక్కడ ఉన్నా తోటను పర్యవేక్షిస్తా..
నాకు వేములపల్లి మండలం మొల్కపట్నంలో 15 ఎకరాల బత్తాయి తోట ఉంది. వృత్తి రీత్యా నల్లగొండలోనే నివాసం ఉంటున్నాను. తోటలో ఫాంహౌస్ కట్టించి చుట్టూ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు పెట్టించాను. నేను ఎక్కడ ఉన్నా తోటలో ఏం జరుగుతుందనేది సీసీ కెమెరాల నుంచి సెల్ఫోన్ ద్వారా చూసుకుంటున్నాను. ఇంట్లో మాదిరిగానే టీవీ, ఫ్రిజ్, ఇతర సౌకర్యాలున్నాయి. నెలలో వారం రోజులు కుటుంబంతో కలిసి ఫాంహౌస్లో గడుపడం సంతోషాన్నిస్తుంది.