
న్యాల్కల్, జనవరి 3 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్లో కొండలు, పచ్చని పొలాల మధ్య స్వయంభూగా వెలిసిన సిద్ధివినాయక స్వామి 222వ జయంత్యుత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పువ్వులు, కొబ్బరి, మామిడి తోరణాలతో అం దంగా అలకరించారు. కంచి కామకోటి పీఠం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేదపండితులు ఆలయంలో ఉదయం వేదఘోష, దీప ప్రజ్వలన, ధ్వజారోహణం, స్వస్తి పుణ్యహ వచనం, అభిషేకం, దేవతా ఆహ్వానం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జహీరాబాద్ పట్టణానికి చెందిన బల్వంత్రెడ్డి కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి స్వామివారికి లక్ష పుష్పాభిషేకం చేశారు. అనంతరం వేదపండితుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు యాగశాల ప్రవే శం చేశారు. మంగళవారం నుంచి హోమాలు నిర్వహించనున్నారు. దీనికోసం ఆలయ సమీపంలోని యాగశాలలో 54 యజ్ఞ గుండాలను ఏర్పా టు చేశారు. హోమాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 250 మందికి పైగా దంపతులు హాజరు కానున్నారు. దీనికోసం యా గశాలలో వేదపండితులు అగ్ని మథనాన్ని చేపట్టారు. అనంతరం యాగశాలలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు రేజింతల్ సంగయ్య, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింహులు, ఉపాధ్యక్షుడు రమేశ్ పాండే, కోశాధికారి నీల రాజేశ్వర్, సెక్రటరీ ఉల్లిగడ్డ బస్వరాజ్, కమిటీ సభ్యులు అల్లాడి వీరేశం, గణేశ్ దీక్షిత్, కోబ్బజీ రవికుమార్, కల్వ చంద్రశేఖర్, సిద్ధప్ప, డాక్టర్ చంద్రశేఖర్, ఆశోక్, మేనేజర్ కృష్ణ, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు.