తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ పంజా విసురుతున్నది. ఉమ్మడి జిల్లాలో గత నాలుగురోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవగా, నిజామాబాద్ జిల్లాలో ప్రతిరోజూ పాతికకు పైనే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. థర్డ్‌వేవ్ సూచనలు కనిపిస్తున్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో మూడో ముప్పు నుంచి రక్షణ పొందాలంటే స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు నిపుణులు. నాణ్యమైన మాస్కును ధరించడం అన్నింటికన్నా కీలకమని చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు జనసమ్మర్దంలోకి రాకుండా ఉండడం, అనివార్యమైన పరిస్థితుల్లో భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య హెచ్చుతున్న నేపథ్యంలో ఉభయ జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి జఠిలమైన పక్షంలో, సమర్థవంతంగా వైద్యసేవలను అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజామాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొన్నేండ్లుగా ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులుగా నమోదవుతున్న కేసుల సంఖ్యనే ఇందుకు నిదర్శనం. మూడో దశ నుంచి రక్షణ పొందాలంటే మరింత అప్రమత్తత అవసరం. ప్రజలంతా కొవిడ్ నిబంధనలను విధిగా పాటిస్తేనే ముప్పు నుంచి సునాయాసంగా బయటపడొచ్చు. మాస్కుల వాడకం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు విధిగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మళ్లీ థర్డ్ వేవ్ మొదలై ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ రూపంలో జడలు విప్పిన మహమ్మారితో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. దాదాపు రెండేండ్లుగా ఈ విపత్తును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శవంతంగా పని చేస్తున్నది. అత్యంత చాకచక్యంగా ఎదుర్కోవడానికి అనుసరించిన కార్యాచరణ దేశ వ్యాప్తంగా వైద్య రంగంలో మౌలిక వనరుల పటిష్టతకు స్ఫూర్తిగా నిలిచింది. మూడో వేవ్ ప్రమాద గంటలు మోగుతున్న ప్రస్తుత తరుణంలోనూ ముందే మేల్కొని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన ఏర్పాట్లకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ దవాఖానలో గతంలోకన్నా ఎక్కువగా ఆక్సిజన్, ఐసీయూ బెడ్లను అందుబాటులోకి తీసుకురానున్నది. మిగితా ఏరియా, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
మొక్కుబడిగా మాస్క్ వినియోగం
జిల్లాలో మాస్కును ధరించడం మొక్కుబడిగా కనిపిస్తోంది. చాలా మంది వాటిని ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. రద్దీ విపరీతంగా ఉంటున్న ప్రాంతాల్లో ఎవరికి వారుగా మాస్కును పక్కాగా ఉపయోగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కు ధరించని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా .. జిల్లాలో ఈతరహా తనిఖీలు, జరిమానాల తీరు నామమాత్రంగానే ఉన్నది. ఒకింత జనాల్లో అవగాహన, చైతన్యాన్ని పెంచడంతోపాటు కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించడం వల్ల మార్పు కనిపించే వీలుంది. పోలీసులు మాత్రం వాహనాలపై మాస్కు ధరించని వారికే ఎక్కువగా జరిమానాలు విధించినట్లు తెలుస్తోంది. భౌతిక దూరంతోపాటు శానిటైజర్ల వినియోగం చాలా చోట్ల తక్కువగానే కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చాపకింద నీరులా జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గత నెలతో పోలిస్తే ఇటీవల నమోదవుతున్న కేసులు కలవరానికి గురి చేస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఒమిక్రాన్ కలకలం…
నాలుగు రోజుల క్రితం ఉమ్మడి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. అమెరికా నుంచి వచ్చిన ఎల్లారెడ్డి వాసికి కరోనా లక్షణాలు బయటపడడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. సదరు వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా ఒమిక్రాన్ వేరియంట్‌గా తేలడంతో ఒక్కసారిగా ఉమ్మడి జిల్లాలో కలకలం మొదలైంది. ఎల్లారెడ్డి వాసి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పట్టణంలో ఎక్కడెక్కడ తిరిగాడు? ఎవరెవరిని కలిశాడు? అనే కోణంలో పోలీసులు, వైద్యారోగ్య బృందాలు జల్లెడ పట్టినప్పటికీ స్థానికుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఓ వైపు తొలి ఒమిక్రాన్ కేసు నమోదైందో లేదో రెండు జిల్లాల్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజులుగా వస్తున్న గణాంకాలను పరిశీలిస్తే తీవ్ర స్థాయిలో వైరస్ పంజా విసురుతున్నట్లే కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే కొద్దిరోజుల్లోనే చాలా మంది వైరస్ బారిన పడే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు సూచనలు చేస్తున్నారు. మరోవైపు దవాఖానల్లోనూ కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు పడకలను సైతం సిద్ధం చేస్తున్నారు.
యంత్రాంగం అప్రమత్తం…
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, ఇటీవల వెలుగుచూసిన ఒమిక్రాన్ కేసులతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వ దవాఖానల్లో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఐసీయూ బెడ్లను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. ఆక్సిజన్ సదుపాయంతో కూడిన పడకలను సైతం రెడీ చేస్తున్నారు. సెకండ్ వేవ్‌లో జీజీహెచ్‌లో ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని అనుకూలంగా మార్చుకుని అద్భుతంగా సేవలు అందించారు. దాదాపుగా 521 బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం కల్పించగా… తాజాగా ఈ సంఖ్యను 750 వరకు పెంచనున్నారు. బోధన్, ఆర్మూర్ ఏరియా దవాఖానల్లోనూ అందుబాటులో ఉన్న బెడ్లను ఐసొలేషన్ వార్డులుగా మార్చనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇప్పటికే సెలవులు రద్దు చేయడంతో అందుబాటులో ఉన్న సిబ్బందికి డ్యూటీలు వేస్తున్నారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ తీవ్రంగా అవసరమైంది. దీంతో జీజీహెచ్‌లో సొంతంగా ఆక్సిజన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొరత లేకుండా ముందస్తుగా అనేక జాగ్రత్త చర్యలను దవాఖాన బాధ్యులు తీసుకుంటున్నారు.
మెరుగైన వైద్యానికి సిద్ధం
ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తే మంచిది. మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్ల వాడకం ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు. సామాజిక వ్యాప్తి జరిగిన తర్వాత ఎవరూ వైరస్ నుంచి తప్పించుకోలేరు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దంటే ప్రజలందరూ బాధ్యతగా కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలి. వైరస్ బారిన పడి ఆరోగ్యం విషమించి దవాఖాన పాలయ్యే బదులు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్‌లో ఏర్పాట్లు చేస్తున్నాం. ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు గతంలో కన్నా ఎక్కువగా పెంచుతున్నాం.