సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 27: పురాతన కావ్యాలను గ్రంథాలయాల్లో భద్రపరచకుండా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే వారిలో చైతన్యం కలుగుతుందని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని సంస్కృత అకాడమీలో ‘సనాతన ధర్మం- సమాజశ్రేయస్సు’పై మూడు రోజుల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జూలూరు గౌరీశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలాలు మారినా, లోకాలు మారినా సమాజాన్ని సరైన మార్గంలో నడిపే శక్తి కవులకు ఉన్నదన్నారు. చారిత్రాత్మక మార్పునకు సదస్సులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. తుపాకీ పట్టిన నక్సలైటు ఎంత త్యాగశీలో కవి కూడా అంతే త్యాగశీలి అని కొనియాడారు. చినజీయర్ స్వామి ఉపదేశాలతో ప్రజలు ఆధ్యాత్మికం వైపు మరలుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవరుచుకోవాలని, దీనికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
మార్కులు, ఉద్యోగాల కోసం సంస్కృతాన్ని అభ్యసించకూడదని కోరారు. జీవితం కోసం, సమాజంలో మార్పు కోసం సంస్కృతాన్ని అభ్యసించాలని సూచించారు. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ, ఓయూకు ఉండే ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదన్నారు. ఇక్కడ విద్యను అభ్యసించేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని చెప్పారు. సంస్కృత అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం మాట్లాడుతూ.. సదస్సు లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ డైరెక్టర్ మహామహోపాధ్యాయ సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు, ప్రొఫెసర్ శశిరేఖ, ఓయూ సంస్కృత విభాగం హెడ్ ప్రొఫెసర్ విద్యానంద ఆర్య, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంస్కృతం విభాగం హెడ్ ప్రొఫెసర్ జేఎస్ఆర్ ప్రసాద్, సదస్సు కో ఆర్డినేటర్ డాక్టర్ జోషి సంతోష్ కుమార్, డాక్టర్ వరలక్ష్మి, సూర్యప్రకాశ్, ఎంఎస్ఎస్వీ శర్మ, మంజీర, శ్రీనివాస్, భరద్వాజ్, రాము తదితరులు పాల్గొన్నారు.