కేంద్రం వైఖరిని దృష్టిలో ఉంచుకొని ఇతర పంటలు సాగు చేసుకోవాలి : జుక్కల్ ఎమ్మెల్యే షిండే
నిజాంసాగర్, డిసెంబర్ 20: యాసంగి పంటల సాగుకోసం నిజాంసాగర్ ప్రాజెక్టునుంచి నీటిని సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో నిండుగా ఉందని, 100 టీఎంసీల మిగులు జలాలను దిగువకు విడుదల చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగుల (17.80 టీఎంసీలు) నీరు నిలువ ఉందని తెలిపారు. యాసంగి సాగు కోసం ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆరు విడుతల్లో నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఆన్ఆఫ్ పద్ధతిలో విడుతల వారీగా సాగునీరందిస్తామని వివరించారు.
లాభసాటి పంటలు పండించండి..
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయని గుర్తుచేశారు. రికార్డు స్థాయిలో వరి సాగును చూసి ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం.. ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పడం తగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని రైతన్నలు దృష్టిలో పెట్టుకొని వరికి బదులుగా లాభసాటి, అధిక దిగుబడులు వచ్చే ఇతర పంటలపై దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, ఇరిగేషన్ ఎస్ఈ వాసంతి, ఈఈ సోలోమన్, డీఈఈ శ్రావణ్‌కుమార్, ఏఈ శివ, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ఏఎంసీ చైర్మన్ బాలకృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.