ధనుర్మాస ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో నెల రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం, కాగా ధనస్సులో సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈనెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. ఈ మాసంలో లక్ష్మీనారాయణులను తులసీదళాలతో పూజించడం పుణ్యప్రదమని వేద పండితులు చెబుతారు.
ఇందూరు, డిసెంబర్ 15: ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడంతో వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి, స్వామిని కీర్తించిందని, సూర్యాలయాలు, వైష్ణవాలయాలను సందర్శించడం చాలా మంచిదని వేదపండితులు సూచిస్తున్నారు. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకల్యాణం తదితర వాటిని ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. ఈ నెలలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడంతో లక్ష్మీదేవి అనుగ్రహంతోపాటు దరిద్రం పోతుందని, నెలరోజుల పాటు తులసీమాల సమర్పించే యువతులకు, నచ్చిన వరుడితో వివాహం జరుగుతుందని చెబుతారు.
ధనుర్మాస వ్రతం..
ఈ వ్రతం ఆచరించాలనుకునే వారు స్థోమత మేరకు విష్ణు ప్రతిమని చేయించి పూజించాలి. రో జూ సూర్యోదయానికి ముం దే స్నానాలు పూర్తి చేసుకోవాలి. పంచామృతాలతో మహావిష్ణువుని అభిషేకించి.. తులసీదళాలు, పూలు, అష్ణోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెలరోజుల పాటు చేయలేని వారు 15రోజులు, 8రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు. ఈ వ్రతం చేయడంతో పరలోక మోక్షం పొందుతారని, ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతమని పురాణాల్లో వివరించారు.
ప్రత్యేక పూజలు..
ధనుర్మాస ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు ముస్తాబయ్యాయి. నిజామాబాద్ నగరంలోని చక్రం గుడి, జెండా బాలాజీ మందిరం, సుభాష్‌నగర్‌లోని శ్రీరామ ఆలయాల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మపురి కాలనీలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం(చక్రం గుడి)లో ఈ నెల 16 నుంచి జనవరి 14వరకు తిరుమల తిరుపతి దేవస్థానము ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తన సేనాపతి సంపత్కుమారాచార్యులు తిరుప్పావై ప్రవచనములు ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు నిర్వహించనున్నారు. గురువారం నుంచి శుద్ధ త్రయోదశి ధనుస్సంక్రమణ పురస్కరించుకొని ఆలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం 4.30 గంటల నుంచి తిరుప్పావై సేవకాలం, ఉపనిషత్ వేదపారాయణం, సామూహిక గోదా అష్టోత్తర శతనామార్చన, సాయంత్రం 5.30 గంటలకు సామూహిక శ్రీలక్ష్మీ స్తోత్రం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శుక్రవారం స్వామివారికి, అమ్మవారికి పంచామృత అభిషేకం, తీర్థగోషి,్ట ప్రసాద వితరణ, విశిష్ట వాహన సేవ, స్వామి కల్యాణం నిర్వహించనున్నారు.
ఎంతో శుభప్రదమైనది..
ధనుర్మాసంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే శుభం కలుగుతుంది. పాశురాలను పారాయణం చేస్తే సమగ్ర గ్రహ దోషాలు తొలగి అఖండ భాగ్యం కలుగుతుంది. తులసీ మాలతో కృష్ణ పరమాత్మను పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.
-సంపత్కుమారాచార్యులు