
కొల్లాపూర్, డిసెంబర్ 15 : పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మూడో ప్యాకేజీలో ప్రధాన కాలువ తవ్వకాల్లో భూములు కోల్పోయిన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్ల బాధిత రైతుల ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అయింది. గ్రామంలో మొత్తం 193 ఎకరాల్లోని భూములతోపాటు మామిడి తోటలు, కరెంట్ మోటర్లు, పైపులైన్లను రైతులు కోల్పోయారు. అయితే మొదట్లో మార్కెట్ ధర ప్రకారంగా 40 ఎకరాలకు రైతులు పరిహారం సొమ్ము పొందారు. మిగితా 153.28 ఎకరాలకు సంబంధించిన ఎక్కువగా చెల్లించాలని సంబంధిత రైతులు డిమాండ్ చేశారు. తమకు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు అందించిన ప్యాకేజీ ఇవ్వాలని కాల్వ పనులకు అడ్డుపడుతూ వచ్చారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డిని సంబంధిత కర్షకులు ఆశ్రయించారు. ఆయన పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వారి కష్టాలను ఆయనకు వివరించి పరిహారం ఎక్కువ వచ్చేలా ఒప్పించారు. ఎకరాకూ రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు భూ పరిహారాన్ని ఆయా రైతుల బ్యాంక్ ఖాతాల్లో మంగళవారం మొత్తం రూ.18 కోట్ల 27 లక్షల 4,456 సొమ్ము జమైంది. తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని రైతులు పేర్కొన్నారు. తాము ఆశించిన మొత్తం బ్యాంక్ ఖాతాల్లో పడడంతో బుధవారం రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కొండ్ర బుచ్చయ్య, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్రావు, లక్ష్మణ్‌రావు, కుబేరుడు, మొట్టె కురుమయ్య, అర్జునయ్య, రైతులు పాల్గొన్నారు.