ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలలో పరిశోధన చేస్తున్న విద్యార్థులందరికీ ఫెలోషిప్ సౌకర్యం కల్పించాలని పరిశోధక విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుంచి ఎలాంటి ఫెలోషిప్‌లు రాకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామన్నారు. యూజీసీ నుంచి వచ్చే నాన్ నెట్ ఫెలోషిప్ సైతం గత నాలుగేళ్ల నుంచి రావడం లేదని గుర్తు చేశారు.
జాతీయ ఫెలోషిప్‌లకు దరఖాస్తు చేసేందుకు కేంద్రప్రభుత్వం నెట్ అర్హత సాధించాలనే నిబంధన విధించడంతో పరిశోధక విద్యార్థులంతా ఫెలోషిప్‌లకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఫెలోషిప్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు క్రాంతిరాజ్, ఆర్ఎల్ మూర్తి, నాగ రాజు, రాల్, బాబు తదితరులు పాల్గొన్నారు.