చౌటుప్పల్ రూరల్, డిసెంబర్ 19: యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తుండడంతో వారు అటువైపు అడుగులు వేస్తున్నారు. దాంతో చౌటుప్పల్ మండలవ్యాప్తంగా వరిసాగు తగ్గుముఖం పట్టింది. గతేడాది ఈ సీజన్లో 11,295 ఎకరాల్లో వరినాట్లు వేయగా ఈ ఏడాది 3వేల ఎకరాల్లో మాత్రమే వరిసాగైనట్లు అధికారులు తెలిపారు. సాగుచేసిన వాటిల్లో కూడా సన్నరకాలే అధికం.
వివిధ రకాల పంటలు
వరిసాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనల మేరకు మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు వేరుశనగ, మినుములు, పెసర్లతో పాటు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల సాగు చేస్తున్నారు. గతంలో వీటిసాగు 200 ఎకరాల లోపే ఉండగా ఈ సారి . ఈ సారి సుమారు 3వేలకు పైగా ఎకరాల్లో సాగయ్యాయి. మిగతా రైతులు కూడా వరి కాకుండా ఇతర పంటలు సాగు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రాంత భూములు నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడుకు కూడా అనుకూలమే కావడంతో రైతులు అటువైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. వ్యవసాయ అధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉండి ఈ విషయమై అవగాహన కల్పిస్తున్నారు.
వరిసాగు విస్తీర్ణం తగ్గింది
ప్రభుత్వ సూచనల మేరకు రైతులకు ఇతర పంటల సాగుపై అవగాహన కల్పిం చాం. దాంతో మండలంలో వరిసాగు విస్తీర్ణం తగ్గింది. అవసరమైన వారికి వ్యవసాయ పరిశోధనా కేంద్రాల నుంచి ఇతర పంటల విత్తనాలు ఇప్పిస్తున్నాం. ఆయా పంటల సాగుపై ఉన్న సదేహాలు నివృత్తి చేస్తున్నాం.
పెట్టుబడి తగ్గింది
యాసంగిలో 5 ఎకరాల్లో వేరుశనగ పెట్టాను. పెట్టుబడి రూ.50వేలైంది. గతేడాది వరివేస్తే రూ.60వేలకు పైగానే ఖర్చు వచ్చింది. వరిసాగు చేయవద్దని ప్రభుత్వం చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్న. వేరుశనగ వేయడంతో పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గినై.
ఉప్పు వెంకటేశం, రైతు, ఎస్.లింగోటం