
అంగన్వాడీ టీచర్లు, ఆయాల్లో సంతోషం వెల్లువెత్తుతున్నది. ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి 30శాతం వేతనాలను పెంచి వారికి ఆర్థిక భరోసా కల్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో అరకొర జీతాలతో అవస్థలు పడిన సిబ్బందికి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ మూడు సార్లు జీతాలు పెంచారు. తాజాగా, మూడోసారి ఆగస్టులోనే వేతనాలను పెంచుతూ జీవో జారీ చేయగా, డిసెంబర్ నుంచే పెరిగిన జీతాన్ని సిబ్బంది ఖాతాల్లో జమ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని 2848, మెదక్ జిల్లాలోని విధులు నిర్వహిస్తున్న 1554 మంది సిబ్బందికి లబ్ధిచేకూరనున్నది. కాగా, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణ, చిన్నపిల్లల విద్యాభివృద్ధికి తాము చేస్తున్న సేవలకు ప్రతిఫలం దక్కిందని, భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని సిబ్బంది పేర్కొంటున్నారు.
సంగారెడ్డి/మెదక్ రూరల్, జనవరి 2 : అంగన్వాడీల్లో సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్వాడీలు, ఆయాల జీతాలను 30శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వాల హయాంలో చాలీచాలని వేతనాలతో పూట గడవని పరిస్థితుల్లో అంగన్వాడీ సిబ్బంది కాలం వెల్లదీశారు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి ఇబ్బందులను గుర్తించి, స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే, అంగన్వాడీలకు ఇచ్చే వేతనాల్లో కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర సర్కారు వాటానే ఎక్కువగా ఉంది . సెంటర్ల నిర్వహణలో ఒకప్పుడు 90శాతం నిధులను భరించిన కేంద్రం, ఇప్పుడు 60 శాతానికి తగ్గించగా, రాష్ట ప్రభుత్వం వాటాను పది నుంచి 40 శాతానికి పెంచింది. కాగా, ఏడేండ్లలో దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో వేతనాలు పెంచడం విశేషం. ప్రస్తుతం, కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ మూడో సారి జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని టీచర్లు, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది.. పెరిగిన వేతనాలు
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1504 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 1344 మెయిన్, 160 మినీ ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో 1504 మంది టీచర్లు, 1344 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, మెదక్ జిల్లాలో 847 మంది అంగన్వాడీ టీచర్లు, 181మంది మినీఅంగన్వాడీ టీచర్లు, 526 ఆయాలు ఉన్నారు. వేతనాలను పెంచుతూ గత ఆగస్టు నెలలోనే జీవో జారీ చేసింది. డిసెంబర్ నెల నుంచే పెరిగిన జీతాన్ని సిబ్బంది ఖాతాల్లో జమ చేశారు. దీంతో అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఉమ్మడి పాలనలో అప్పటి ప్రభుత్వం రూ.4200లు ఇవ్వగా, స్వరాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీలకు మూడు సార్లు వేతనాలు పెంచింది. 2015 సంవత్సరానికి ముందు అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.4,200ఉండగా, 2015 మే నెలలో రూ.7000.. మళ్లీ 2017 మార్చిలో రూ.10,500కి ప్రభుత్వం పెంచింది. తాజాగా, 13650కు చేరుకున్నది. ఆయాల వేతనం రూ. ఆరు వేల నుంచి రూ7800 అయింది.
పౌష్టికాహారం అందిస్తున్న కేంద్రాలు
గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలతో సమతుల్యమైన భోజనం సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా చిన్నారులకు ఆరోగ్యం, విద్య అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అలాగే, చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అంగన్వాడీలను బలోపేతం చేయడానికి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.
సీఎం నిర్ణయం సంతోషకరం
ప్రభుత్వం అంగన్వాడీల సేవలు గుర్తించి మూడోసారి వేతనాలు పెంచడం సంతోషకరం. ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీలు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా బాగుంది. అంగన్వాడీల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సరఫరా చేస్తూ వారి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాం. ప్రభుత్వం అందజేస్తున్న సరుకులను సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారికి అందజేస్తున్నాం. మా సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచడం ఆనందంగా ఉంది. ప్రభుత్వ లక్ష్యం మేరకు అంగన్వాడీల్లో సేవలు విస్తృతం చేసి మెరుగైన ఫలితాలు సాధిస్తాం.
అంగన్వాడీల సేవలు గుర్తించి ప్రభుత్వం పెంచిన వేతనాలు విడుదల చేయడం ఆనందంగా ఉంది. అంగన్వాడీల్లో పనిచేసే టీచర్లు, ఆయాలపై మరింత బా ధ్యత పెరిగింది. మా సమస్యలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ వేతనాలు పెంచి అమలు చేయడం సంతోషకరం. పిన్న వయస్సు నుంచే విద్యాభ్యాసంపై దృష్టిసారించే విధంగా చదువు నేర్పిస్తున్నాం. ఆరోగ్య సమస్యలు రాకుం డా ఎప్పటికప్పుడు పిల్లల బరువు తూకం వేస్తున్నాం. పెంచిన వేతనాలు విడుదల చేసి అంగన్వాడీ టీచర్లు, ఆయాల కుటుంబాల్లో సంతోషం నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
సేవలకు దక్కిన ప్రతిఫలం
అంగన్వాడీలకు వేతనాలు పెంచడం వారు చేసిన సేవలకు దక్కిన ప్రతి ఫలమే. జిల్లాలో 5 ప్రాజెక్టుల్లో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బంది గర్బిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్యం అందిస్తూ, విద్యాబుద్దులను నేర్పిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల కుటుంబాలకు భరోసా కలిగించే విధంగా సర్కారు నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. అంగన్వాడీ కేంద్రాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అన్ని వర్గాలకు మేలు చేస్తాయి.