యాదాద్రి, డిసెంబర్ 30 : రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందువరుసలో నిలబడి కొట్లాడిన ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ సముచిత గౌరవాన్ని ఇచ్చారని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ హైదరాబాద్లోని కార్యాలయంలోగురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి బాలరాజు యాదవ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం మహేందర్రెడ్డి మాట్లాడుతూ డీసీసీబీ, టెస్కాబ్తో అనేక మంది రైతులకు గొర్రెల రుణాలు మంజూరు చేశామని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 400 మందికి నాబార్డు ద్వారా బీసీలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 33 శాతం రాయితీ ఇచ్చి కోట్ల రుణాలతో గొర్రెలు, ఫౌల్ట్రీ యూనిట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు రూ. 25 కోట్ల సబ్సిడీ వస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే రూ. 16 కోట్ల సబ్సిడీ కింద 300 మంది గొర్లకాపరులకు రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు.