
దేవరకద్ర రూరల్, డిసెంబర్ 15: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలో చిన్నరాజమూర్లో వెలసిన ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 16నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారి ఉత్సవాలకు మన జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ ఉత్సవాల్లోని ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం ఈనెల 19న అంగరంగ వైభవంగా జరుగనున్నది. ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఆలయానికి 400 ఏండ్ల చరిత్ర
చిన్న రాజమూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి 400 ఏండ్ల చరిత్ర ఉన్నది. వడ్డెపల్లి మండలంలోని రాజోళి గ్రామ శివారులోని తుంగభద్ర నదీ తీరంలో వ్యాస మహర్షి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేసినట్లు అక్కడి శాసనం ద్వారా తెలుస్తుంది. కాలక్రమంలో ఆ విగ్రహం భూస్థాపితమైంది. అనంతరం స్వామివారే ఓ రైతుతో కలలో కనబడి తన విగ్రహాన్ని ఇక్కడ నుంచి ఎడ్ల బండిపై ఉత్తర దిశగా వెళుతూ ఉంటే ఎక్కడైతే బండి ఇరుసు విరిగి పోతుందో అక్కడే ప్రతిష్ఠించాలని తెలిపినట్లు చరిత్ర చెబుతున్నది. ఆమేరకు రైతు స్వామివారి విగ్రహాన్ని బండిపై తీసుకుని ఉత్తర దిశగా వెళ్తున్న క్రమంలో ఇప్పుడున్న చిన్నరాజమూర్ గ్రామ శివారులో బండి ఇరుసు విరిగి పోగా అక్కడే స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నట్లు పెద్దలు చెబుతుంటారు.
కోరికలు తీర్చే చింతచెట్టు
ఆంజనేయ స్వామి దేవస్థానంలోని గర్భగుడి పక్కన పెద్ద చింతచెట్టు ఉంది. ఈ చింతచెట్టుకు దాదాపుగా 450సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ చింతచెట్టుకు మొక్కుబడిగా తమ కోరిన కోరికలు తీరాలంటూ కొబ్బరి కాయను కడితే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ప్రత్యేక బస్సు సౌకర్యాలు
స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను నడుపనున్నది. దేవరకద్ర నుంచి, చిన్నరాజమూర్కు ప్రత్యేక జాతర బస్సులు నడుస్తాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దేవరకద్రకు చేరుకుంటే ఇక్కడ నుంచి బస్సుల్లో దేవస్థానానికి చేరుకోవచ్చు.
ఉత్సవాల విశేషాలు
ఈనెల 16నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ధ్వజారోహణం, పంచామృతాభిషేకం, హంస వాహన సేవతో పాటు వివిధ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. 17న పంచామృత అభిషేకం, అలంకరణ, శ్రీనివాస కల్యాణం, 18న పంచామృతాభిషేకం అలంకరణ, అశ్వవాహన సేవ, 19న పంచామృతాభిషేకం, మహా అలంకరణ, గజవాహన సేవ, గరుఢవాహన సేవ, రథోత్సవం కార్యక్రమం.
ఏర్పాట్లు పూర్తి
బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం వద్ద భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. తాగునీటి వసతి, విద్యుత్ తదితర ఏర్పాట్లు చేశాం. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నాం. ఉత్సవాలకు వచ్చే భక్తులు దేవస్థానం పవిత్రతను కాపాడాలని కోరుకుంటున్నాం.