
ఇల్లెందు, డిసెంబర్ 19 : ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా నిరసన సెగ ఢిల్లీకి తాకాలని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులు, పార్టీ శ్రేణులతో నియోజకవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయకుండా మొండివైఖరిని అవలంబిస్తున్నదన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. సోమవారం జరిగే నిరసన కార్యక్రమంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రప్రభుత్వం చేతులెత్తేసిన విషయాన్ని రైతులకు స్పష్టంగా వివరిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే ఈ కార్యక్రమాన్ని రైతులు, పార్టీ శ్రేణులు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాల ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు శీలం రమేశ్, కొక్కు నాగేశ్వరరావు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.