
యాసంగింలో ప్రత్యామ్నాయ పంటల సాగు లాభదాయకమని వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుండటంతో రైతులు ఆరుతడిపంటలపైపు మొగ్గుచూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనమని చెప్పడంతో రైతులు ఇతర పంటలను సాగు చేస్తూ లాభాలు అర్జిస్తున్నారు.
రామాయంపేట, జనవరి 2 : రామాయంపేట మండలం గిరిజన తండాలో ఎకరంలో పది రకాల కూరగాయలు, ఇతర పంటలను వేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు మాలోత్ గన్యా నాయక్. వానకాలంలో వరిని సాగు చేసిన రైతు గన్యా.. ప్రస్తుతం ప్రభుత్వం సూచనల మేరకు యాసంగిలో అంతర పంటలైన పాలకూర, టమాట, వంకాయ, కొత్తిమీర, పుదీన, బెండకాయ, పచ్చిమిర్చిని సాగు చేస్తున్నాడు. వరికంటే ఇతర పంటలే లాభదాయకంగా ఉన్నాయంటూ రైతు గన్యానాయక్ చెప్పుకొచ్చారు. వరిపంటకైతే మూడు నెలల వరకు ఆగాల్సి వచ్చేది. పురుగు మందులు చల్లినా, దిగుబడి ఆశాజనంగా రాలేదని తెలిపారు. ప్రస్తుతం అంతర పంటలు వేసిన 45 రోజులకే పంట చేతికొచ్చి ప్రతిరోజూ అంగడిలో విక్రయాలు జరుపుతున్నానని, నెలరోజుల్లోనే దాదాపు పెట్టుబడి పోనూ రూ.50 వేల వరకు ఆదాయం వచ్చిందని తెలిపాడు.
జిల్లాస్థాయి యువజనోత్సవాలు వాయిదా
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 2 : నేడు జరగాల్సిన జిల్లాస్థాయి యువజనోత్సవాలు ఒమిక్రాన్ దృష్ట్యా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి నిర్వహణ తేదీని తెలుపుతామన్నారు. యువతీ, యువకులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చైర్మన్ పదవి మాలలకు కేటాయించాలి
నిజాంపేట,జనవరి 2 : ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని మాలలకే కేటాయించాలని మాల మహానాడు మండలాధ్యక్షు డు చంద్రయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన నిజాంపేటలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆయన వెంట మాలమహానాడు సభ్యులు బత్తుల రాజయ్య, వినోద్, రాగుల బాబు, చం ద్రం, లక్ష్మణ్, స్వామి ఉన్నారు.