కవాడిగూడ : ప్రభావవంతమైన కాలజ్ఞానం బోధించి, సకల జనుల హితం కోరిన గొప్ప సంఘసంస్కర్త, భవిష్యత్ దర్శి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు.
సమాజంలో ఏ వింత జరిగినా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని ప్రజలు చర్చించుకోవడం గమనించదగింద ని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ట్యాంక్‌బండ్‌లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం వద్ద విశ్వకర్మ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 413వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, తెలంగాణ పంచాయితీరాజ్ ట్రిబ్యూనల్ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్. ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కే. కిషోర్ గౌడ్లు హాజరై వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ పరమత సహనాన్ని, సర్వమానవ కళ్యాణాన్ని ఆకాంక్షించి అనుసరింప జేసిన మహోన్నత ఆశయవాది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఆయన కొనియాడారు. జీవితంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షుడు రవీంద్రాచారి, ప్రధాన కార్యదర్శి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.