
ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలం రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 768 మంది ఓటర్లు ఉండగా.. 738 మంది ఓటు వేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, హరిప్రియానాయక్, సండ్ర వెంకటవీరయ్య, మల్లు భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనారోగ్యం కారణంగా ఎమ్మెల్యే వనమా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పెనుబల్లి మండలం లంకపల్లి ఎంపీటీసీ చిలుకూరి శ్యామల లండన్ నుంచి వచ్చి కల్లూరు కేంద్రంలో ఓటు వేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు తదితరులు కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను భారీ బందోబస్తు మధ్య ఖమ్మం నగరం డీపీఆర్సీ భవనంలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఎన్నికల పరిశీలకుడు సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ వీపీ గౌతమ్ బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలించారు.
లండన్ టు లంకపల్లి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఎంపీటీసీ సభ్యురాలు
పెనుబల్లి, డిసెంబర్ 10: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓ ప్రజాప్రతినిధి లండన్ నుంచి లంకపల్లికి వచ్చింది. పెనుబల్లి మండలం లంకపల్లి ఎంపీటీసీ సభ్యురాలు చిలుకూరి శ్యామల కొన్ని రోజుల క్రితం సొంత పనుల నిమిత్తం లండన్ వెళ్లింది. ఈలోపు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, సమాచారం అందడంతో ఓటు వేసేందుకు తిరుగుపయనమైంది. ఖర్చుకు సైతం వెనుకంజ వేయకుండా నేరుగా రెండు రోజుల ముందుగా లండన్ నుంచి స్వగ్రామమైన లంకపల్లికి చేరుకున్నది. శుక్రవారం కల్లూరులోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నది. పెనుబల్లి మండలంలోని 15 మంది ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 13 మంది ఎంపీటీసీలు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే. స్వతంత్రులైన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు సైతం టీఆర్ఎస్కే మద్దతు పలికారు. వార్ వన్‌సైడే అన్నట్లుగా మొత్తం ఓటర్లు టీఆర్ఎస్కు అనుకూలంగా ఓటు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.