ఇటీవల రాష్ర్టానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన పిల్లల బర్త్‌డే వేడుకల కోసం రెండు రోజులపాటు పొరుగురాష్ర్టానికి ఇలా వెళ్లి అలా వచ్చినందుకు బీజేపీ నేతలు కొందరు సభ్యత, సంస్కారం వదిలేసి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. తన సోషల్ మీడియా అకౌంట్లలో సదరు ప్రజాప్రతినిధి స్వయంగా ఎప్పటికప్పుడు ఫొటోలు పెట్టి సమాచారాన్ని ప్రజలకు చేరవేసినప్పటికీ.. ‘ఎక్కడున్నావ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో అర్వింద్ రచ్చకు యత్నించారు. సభ్యత, స్థాయి మరిచి అనుచితంగా పోస్టులు పెట్టారు. సీన్ కట్ చేస్తే ఇదే ఎంపీ గడిచిన నాలుగైదు రోజులుగా పత్తా లేకుండా పోయారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చినా.. ఏ కార్యక్రమాల్లోనూ అర్వింద్ కనిపించలేదు. బండి సంజయ్ అరెస్టు అయినప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన.. ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నారు. దీంతో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా అర్వింద్ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా అర్వింద్‌పై ఇప్పటికే పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
నిజామాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిత్యం సోషల్ మీడియా వేదికగా అవాకులు చవాకులు పేలడం.. నోటికొచ్చినట్లు మాట్లాడడం.. వ్యవస్థలపై బురద చల్లడం, ప్రభుత్వం, పార్టీలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం, ప్రత్యర్థుల కుటుంబాలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం వంటి చర్యలకు పెట్టింది పేరుగా మారిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నాలుగైదు రోజులుగా కనిపించడంలేదు. ఇటీవల రాష్ర్టానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి ఒకరు తన పిల్లల బర్త్‌డే వేడుకల కోసం రెండు రోజులపాటు పొరుగు రాష్ర్టానికి వెళ్లివచ్చినందుకు బీజేపీ నేతలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సదరు ప్రజాప్రతినిధి తన సోషల్ మీడియా అకౌంట్లలో ఎప్పటికప్పుడు ఫొటోలు పెట్టి సమాచారాన్ని ప్రజలకు చేరవేసినప్పటికీ.. ‘వేర్ఆర్యూ..’ అన్న తరహాలో ఎంపీ అర్వింద్ అవహేళనకు దిగుతూ పోస్టులు పెట్టారు. ప్రజలెన్నుకున్న ఎంపీగా బాధ్యతతో మెలగాల్సిన అర్వింద్ వక్రధోరణిని నిజామాబాద్ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇదేం సంస్కారం అంటూ నిలదీస్తున్నారు. పలు బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలతో ఇప్పటికే జైలుదాకా వెళ్లివచ్చి ప్రస్తుతం బెయిల్‌పై కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న యూట్యూబ్ చానల్లోనూ సదరు ప్రజా ప్రతినిధిపై అవాకులు చవాకులు పేలిన ఎంపీ అర్వింద్.. గడిచిన నాలుగైదు రోజులుగా పత్తా లేకుండా పోయారు. రాష్ర్టానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చినప్పటికీ ఏ కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. అంతేగాకుండా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం గమనార్హం. దీంతో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా అర్వింద్ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు..అంటూ అడుగుతున్నారు.
అజ్ఞాతంలో అర్వింద్.
నోటికొచ్చినట్లు మాట్లాడడం, వ్యవస్థలపై బురద చల్లడం, మహిళలు అనే గౌరవం లేకుండా అసభ్యంగా వ్యాఖ్యలు చేయడం.. ప్రభుత్వం, పార్టీలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం వంటి చర్యలకు పెట్టింది పేరుగా నిలుస్తున్నారు లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్. అబద్ధాలు, మోసపూరిత హామీలతో దొడ్డి దారిలో ఎంపీగా గెలిచిన అర్వింద్… మూడేండ్లుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి చేసిందేమీ లేదు. ప్రజల దృష్టిని పసుపు బోర్డు హామీ నుంచి మరల్చేందుకు నిత్యం బూతులు మాట్లాడి న్యూస్ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో మెరవాలని భావిస్తుండడం చిత్ర విచిత్రంగా మారింది. కరీంనగర్లో జీవో 317కు వ్యతిరేకంగా జాగరణ దీక్ష పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆడిన డ్రామాను ప్రజలంతా తూర్పారబట్టారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి బీజేపీ ఎంపీ చేసిన రాద్ధాంతాన్ని సభ్య సమాజం చీదరించుకున్నది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నేరారోపణలతో ఆదివారం రాత్రి బండి సంజయ్ అరెస్ట్ అయినప్పటి నుంచి ధర్మపురి అర్వింద్ పత్తా లేకుండా పోయారు. పోలీస్ అధికారులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా అనుచితంగా మాట్లాడడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ ఎంపీపై కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా 2021, అక్టోబర్ నెలలో చంచల్‌గూడ జైలు వద్ద ఓ రిమాండ్ ఖైదీని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అర్వింద్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది. దళిత ప్రజలను కించపరిచినందుకు నిజామాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త బంగారు సాయిలు ఫిర్యాదు మేరకు అర్వింద్‌పైన అట్రాసిటీ కేసు సైతం నమోదైంది. సభ్యత మరిచి ఇష్టానుసారంగా మాట్లాడిన ఎంపీపై కేసులు నమోదు కావడంతో భయపడిపోయిన అర్వింద్ గడిచిన నాలుగు రోజులుగా కనిపించకుండా పోయారు.
ఇదేం తీరు
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మంగళవారం వచ్చాడు. పనిలో పనిగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే… ఈ కార్యక్రమంలోనూ ఎంపీ ధర్మపురి అర్వింద్ పత్తా లేకుండా పోయారు. స్వయంగా జాతీయ అధ్యక్షుడు వచ్చిన కార్యక్రమానికి అర్వింద్ డుమ్మా కొట్టడం ఏంటంటూ సోషల్ మీడియాలో సొంత పార్టీకి చెందిన వారే విమర్శిస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసే వ్యక్తి జాతీయ అధ్యక్షుడి పర్యటనలో కనిపించకపోవడం ఏంటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కరీంగనర్ జైలులో ఉన్న సాటి బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను పరామర్శించేందుకు కూడా అర్వింద్ సాహసించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. బీజేపీలోని ఓ వర్గం నేతలంతా కలిసి అర్వింద్ తీరును తీవ్రంగా వ్యతిరేకించినట్లు నిజామాబాద్ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇష్టానుసారంగా మాట్లాడడం మూలంగానే పార్టీ అధ్యక్షుడికి జైలులో ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురైందంటూ ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.
ఎంపీ పదవికే మచ్చ తెస్తున్న అర్వింద్
నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్ గడిచిన మూడేండ్లలో ఈ ప్రాంతానికి చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటీ లేదు. నిత్యం మీడియాలో కనిపించేలా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలపై నోరు విప్పి మాట్లాడింది ఇప్పటి వరకూ కనిపించలేదు. లోక్‌సభ సభ్యుడంటే నిజామాబాద్ జిల్లాలో ఓ గౌరవం ఉండేది. ఇప్పుడు అర్వింద్ వచ్చిన తర్వాత ఆ పదవికే మచ్చ తీసుకువచ్చాడు.
రైతులు కొడతారనే భయంతోనే…
ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి దొడ్డి దారిలో ఎన్నికల్లో గెలిచాడు. రైతులను నట్టేట ముంచేసి కపట నాటకం ఆడుతున్నాడు. పసుపు బోర్డు, పసుపు పంటకు మద్దతు ధరపై రైతులు ఎక్కడ తనను పట్టుకుని కొడతారేమో అన్న భయంతో రోజుకో రకంగా ప్రకటనలు చేసి తప్పించుకుంటున్నాడు. అందరి దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించి హామీలు పక్కదారి పట్టిస్తున్నాడు.