
మహబూబ్‌నగర్, డిసెంబర్ 20 : ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు అత్యుత్తమ వైద్య సేవలందుతున్నాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా జనరల్ దవాఖానలో మహీంద్రా కంపెనీ సహకారంతో రూ.కోటితో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల మంది సిబ్బందితో నాణ్యమైన వైద్య సేవలందిస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా తరువాత మహబూబ్‌నగర్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమలు స్థాపిస్తే వందశాతం సహకరిస్తామ ని, యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు కల్పిం చే విధంగా ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు. రూ.400 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టాశ్రీనివాస్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, మహీం ద్రా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాం, అడ్మినిస్ట్రేషన్ ప్రదీప్‌గౌడ్, ఫైనాన్స్ హెడ్ బాల బ్రహ్మేశ్వరరావు, దవాఖాన అభివృద్ధి సంస్థ సభ్యులు వెంకన్న, లక్ష్మి ఉన్నారు.
ఆనాడు ఎవ్వరూ ఆదుకోలేదు..
ఉమ్మడి రాష్ట్రంలో ఆడబిడ్డ పెండ్లికి ఆదుకున్న వారే లేరని, నేడు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.లక్ష అందజేసి ప్రభుత్వం చేదోడువాదోడుగా నిలుస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో 405 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వార్థప్రయోజనాలకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీల నేతలను నమ్మొద్దన్నారు. ప్రతి కుటుంబానికీ టీఆర్ఎస్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవర్, తాసిల్దార్ పార్థసారధి, అధికారులు రాజాగోపాల్, క్రాంతికుమార్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
అందరికీ ఉపాధి కల్పించాలి..
అందరికీ ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ముం దుకు సాగాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. క్రీడా, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సెట్విన్ సంస్థ ద్వారా శిక్షణ పొందిన 96 మందికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ ఉద్యోగం అనుకోకుండా కష్టపడి ముందుకు సాగితే ఉన్నతస్థాయికి చేరుకుంటారని తెలిపారు.
న్యాయవాదులకు అండగా ఉంటాం..
న్యాయవాదులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో రూ.15లక్షలతో నిర్మించిన పార్కింగ్షెడ్డును మంత్రి ప్రారంభించారు. అనంతరం బార్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో బార్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. జిల్లా క్లబ్లో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, బార్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.