సీపీజీఈటీ-2021 పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) – 2021 ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ విధానంలో శనివారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పది రోజుల పాటు రోజు మూడు సెషన్లలో మొత్తం 50 సబ్జెక్టులలో ప్రవేశ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
తమ వెబ్సైట్ http://www.tscpget.com లో సంబంధిత రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, పేరు నమోదు చేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరీక్షా కేంద్రంలో కోవిడ్ నిబంధనలను పాటించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వివరించారు.
హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సు (బీహెచ్ఎంసీటీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీహెచ్ఎంసీటీ మొదటి, రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
ఎంబీఏ పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 17: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 30వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చన్నారు.
రూ.300 అపరాధ రుసుముతో వచ్చే నెల 7వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.