సంగారెడ్డి డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ) : అమీన్పూర్ పెద్ద చెరువు కట్ట ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం కదిలింది. స్వయంగా కలెక్టర్ హనుమంతరావు రంగంలోకి దిగారు. చెరువు కట్టను రక్షించేందుకు సంయుక్త సర్వేకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం సర్వే నిర్వహించనున్నారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘అమీన్పూర్ చెరువు ఆక్రమణ’పై కథనం ప్రచురితమైంది. బయోడైవర్సిటీ చెరువుగా ప్రకటించిన అమీన్పూర్ పెద్ద చెరువు కట్టను పలువురు తవ్వడంతో పాటు కట్టపై అక్రమంగా గేటును నిర్మించారు. అలాగే, చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆక్రమణదారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారు అధికారులతో ఘర్షణకు దిగారు. ఈ విషయాలన్నింటిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనాన్ని చదివిన కలెక్టర్ హనుమంతరావు వెంటనే స్పందించారు. ఆక్రమణ వ్యవహారంపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆర్డీవో, తహసీల్దార్‌ను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్త సర్వే జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. దీంతో సోమవారం సర్వే నిర్వహించేందుకు రెండు శాఖల అధికారులు సిద్ధం అవుతున్నారు. ఆదివారం మరోమారు చెరువు ఆక్రమణలను పరిశీలించిన ఇరిగేషన్ ఏఈఈ వరప్రసాద్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సోమవారం సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమ నిర్మాణలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పట్టాదారుల ముసుగులో ఆక్రమణకు యత్నం?
పట్టాభూముల ముసుగులో కబ్జాదారులు అమీన్పూర్ చెరువు ఆక్రమణకు తెగబడుతున్నారు. కట్టను అడ్డంగా తవ్వేసి గేటు నిర్మాణం చేపట్టి, పక్కనే ఉన్న కొత్త చెరువును సైతం ఆక్రమించుకునే ఎత్తుగడలు వేస్తున్నారు. కొత్త చెరువు కట్టకు అడ్డంగా నిర్మాణాలు చేస్తే చెరువుకు వెళ్లే దారి మూసుకుపోతుంది. దీంతో కొత్త చెరువులోకి ఎవరూ ప్రవేశించలేని పరిస్థితి వస్తుంది. కాగా, అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమణదారులు శరవేగంగా ప్రహరీ నిర్మాణం పనులు చేపడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం సైతం ప్రహరీ నిర్మాణం కొనసాగిస్తుండటంతోపాటు జేసీబీలతో బండరాళ్లను తొలగించి భూములను చదునుచేస్తూ, రహదారులు వేసే పనులు కొనసాగిస్తున్నారు. అలాగే, అమీన్పూర్ చెరువు కట్ట పక్కన ఉన్న ప్రాంతంతో పాటు కట్ట దిగువున ఉన్న దేవుడి మాన్యం భూములను కూడా కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే పెద్ద చెరువు కట్ట ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే పేర్లను బోర్డులపై రాయటం చర్చనీయాంశంగా మారింది.