సాగుపై ఆధారపడిన సన్నకారు రైతులను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో రూ.వేలకోట్లు వెచ్చించి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తుండడంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్నదాతలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఓవైపు యాసంగి పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో చకచకా జమవుతుండగా.. మరోవైపు కర్షకులు సంబురాలు జరుపుకొంటున్నారు. కేసీఆర్ చేస్తున్న ఉపకారాన్ని గుర్తుచేసుకుంటూ ఊరూరా ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతుబంధుపై వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల విద్యార్థులకు రైతుబంధుపై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నారు.
అప్పుల బాధ తప్పింది..
నిజామాబాద్, జనవరి 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి):రైతుబంధు పథకం వచ్చిన తర్వాత కర్షకుల బతుకులు గాడిలో పడుతున్నాయి. గతంలో ప్రభుత్వాలకే వివిధ రూపంలో రైతులు సొమ్ములు చెల్లించే పరిస్థితి ఉండేది. కానిప్పుడు సీఎం కేసీఆర్ చొరవతో పెట్టుబడి సాయం కింద నగదు నేరుగా రైతులకే అందిస్తున్నారు. గుంట భూమి ఉన్న రైతు నుంచి మొదలుకొని పట్టాదారు పేరు మీద భూముల వివరాల మేరకు ఆర్థిక సాయం చేరుతున్నది. సాగుకాలం మొదలవుతున్న సందర్భంలోనే ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో రూ.వేల కోట్లు వెచ్చించి రైతుబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుండడంతో సీఎం కేసీఆర్కు అన్నదాతలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయన చిత్రపటానికి ఊరూ… వాడా తేడా లేకుండా క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
10వ తేదీ వరకు సంబురాలు..
వ్యవసాయ రంగం పురోగమించడానికి కేసీఆర్ అమలు చేసిన అనేక కార్యక్రమాలు ఉపకరించాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు నీటి సౌకర్యం కల్పించడం ద్వారా బీడు భూములు సాగులోకి వచ్చాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు పడడంతో భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. కాలువల కింద సాగుకు ఊపిరి పోసినట్లు అయ్యింది. నీళ్లుండే, కరెంట్ వచ్చే… పెట్టుబడికి ప్రభుత్వమే పైసలివ్వడంతో రైతు కాసింత శ్రమ పడితే పంటలు పండించే పరిస్థితికి రాష్ట్రం చేరుకున్నది. ఇందులో భాగంగా ఎనిమిది విడుతల్లో రైతులకు అందించిన రైతుబంధు మొత్తం విలువ రూ.50వేల కోట్లకు చేరడంపై ఈనెల 10వ తేదీ వరకు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా మాక్లూర్ ప్రభుత్వ పాఠశాలలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున రైతుబంధు సంబురాలు జరిగాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే జాజాల సురేందర్ క్షీరాభిషేకం చేశారు. బాన్సువాడలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
రూ.50వేల కోట్లకు రైతుబంధు సాయం..
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రైతుబంధు పథకం పేరి ట చేసిన సాయం అక్షరాల యాభై వేల కోట్ల రూపాయలు. ఇదీ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగేండ్ల కాలంలో పెట్టుబడి సాయంగా రైతుకు సర్కారు అందించిన మొత్తం విలువ. 2018, వానకాలం నుంచి అమలవుతూ వస్తున్న పథకం ఎన్ని సంక్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దరిమిలా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులపై ప్రేమను ఒలకబోస్తున్నట్లుగా బొటాబొటిన సాయం చేస్తూ చేతులు దు లుపుకొంటున్నది. కేవలం వేల మందికి అరకొర సా యంతో కేంద్రం గొప్పలు చెప్పుకుంటుంటే… రాష్ట్రంలో ఎనిమిది విడుతల్లో రైతులకు అందించిన ఆర్థిక సా యం రూ.50వేల కోట్లకు చేరుతుండడం చరిత్రగా నిలిచిపోనున్నది. ఈ నెల 10వ తేదీ నాటికి ఎనిమిదో విడుత రైతుబంధు సాయం అర్హులైన రైతులందరికీ జమ కానున్నది. ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ రైతులు, రైతు నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహిస్తున్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సాయం 50వేల కోట్ల రూపాయలుగా ఉండగా..ఒక్క నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మందికి అందించిన సాయం కూడా రికార్డు స్థాయిలో రూ.2వేల కోట్లకు చేరుతుండడం విశేషం.
కేసీఆర్కు జేజేలు..
ఏడేండ్ల కేసీఆర్ పాలనలో రైతులకు చేకూరిన లాభం అంతా ఇంతా కాదు. క్లిష్టమైన అనేక సమస్యలకు ముఖ్యమంత్రి తనదైన శైలిలో చెక్ పెట్టారు. 24గంటల కరెంట్ సరఫరా, సాగుకు నీళ్లు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిం చి రైతు లోకం నుంచి ప్రశంసలు పొందుతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనతో చిక్కుముడులతో కూడిన సమస్యలను తీర్చి రైతుకు భారీ ఊరటను అందించారు. భూకబ్జాదారుల ప్రమేయం తగ్గించి అసలైన వ్యక్తులకే పట్టాలు దక్కేలా, దొంగ రిజిస్ట్రేషన్లు బంద్ చేసేలా ధరణి సేవలను సీఎం కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటున్న రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు ఉన్న క్రేజ్ అసాధారణమైనది. రైతులకు అనేక రూపాల్లో ముఖ్యమంత్రి అందిస్తున్న సేవలను గుర్తుకు తెచ్చుకుంటున్న రైతులంతా యాసంగిలో పంట పెట్టుబడికి నగదును స్వీకరించిన అనంతరం కేసీఆర్కు జేజేలు పలుకుతున్నారు.