
ఖమ్మం, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా రైతు బంధు సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. శనివారం ఐదోరోజు రైతులు, ప్రజాప్రతినిధులు వినూత్న రీతిలో వేడుకలు నిర్వహించారు. రైతులు తమ ఇండ్ల ముందు ముగ్గులు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వేంసూరు మండలం మర్లపాడులోజరిగిన రైతుబంధు వారోత్సవాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. వైరా మండలంలోని పలు గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలకు ఎమ్మెల్యే రాములునాయక్ హాజరయ్యారు. రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చింతకాని మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సంబురాలకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని రైతుబజారులో ఉద్యానపంటల సాగు రైతుల సంబురాలకు ఖమ్మం ఏఎంసీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న, మంత్రి వ్యక్తిగత సహాయకుడు చిరుమామిళ్ల కిరణ్ హాజరయ్యారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య బహుమతలు అందజేశారు.
సంక్రాతి పండుగ వరకూ సంబురాలు
రైతు పండుగ సంక్రాంతి పర్వదినం వరకూ రైతుబంధు సంబురాలు జరుగనున్నాయి. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలకు చేరుకోకపోవడంతో మరికొద్ది రోజులు వేడుకలు కొనసాగించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల10వ తేదీ వరకు ఆంక్షలు ఉన్నందున మరికొద్ది రోజులు కొనసాగించాలన్నారు. ఒకే దగ్గర రైతులు గూమికూడకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలతో సంబురాలు చేసుకోవాలని సూచించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు వేడుకలు కొనసాగేలా ప్రజాప్రతినిధులు ప్రణాళికను సిద్ధం చేశారు. రేపటితో జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతుబంధు సొమ్ము జమ కానున్నది.