ఒమిక్రాన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తున్నది. రోజురోజుకూ మహమ్మారి తన ప్రభావాన్ని చూపుతున్నది. నిత్యం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నది. వారం రోజులపాటు సభలు,
సమావేశాలు, ర్యాలీలను నిషేధించింది. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, దుకాణాలు, సూపర్మార్కెట్లు, రైతుబజార్లు, సినిమా థియేటర్లు వంటి జనం గుమిగూడే ప్రదేశాల్లో భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరి చేసింది. మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.వెయ్యి జరిమానా విధించనున్నది. ప్రజలు నిబంధనలు పాటిస్తూనే జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అవగాహన కల్పిస్తున్నది.
నాగర్కర్నూల్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఓమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కొన్నిరోజులుగా కేసులు పెరుగుతున్నాయి. ఈనెలలో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమైంది. ఈనెల 10వ తేదీవరకు ప్రత్యేకంగా ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. వారంరోజులపాటు ఆంక్షలను అమలులో ఉంచనున్నది. రెండేండ్లుగా కరోనా వివిధ రూపాల్లో ప్రభావం చూపుతున్నది. వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నది. ఈ క్రమంలో తాజాగా ఓమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతున్నది. ఇది గతేడాది డెల్టాప్లస్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. వారంరోజులపాటు సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సభలకు అనుమతులు ఇవ్వరాదని ఆదేశించింది. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం కరోనా నిబంధనలను అమలు చేస్తుండగా, కొన్ని రాజకీయ పార్టీల నేతలు రాజకీయాపేక్షతో సభలు, ఊరేగింపులకు సన్నద్ధమవుతున్నారు. దీనిపై ఆయా పార్టీలు పునరాలోచించాల్సిన అవసరముందని వైద్యులు సూచిస్తున్నారు. వారంరోజులపాటు అప్రమత్తంగా ఉంటే మూడో దశ నుంచి ప్రజలకు ఊరట లభించనున్నది. అలాగే ఆర్టీసీ బస్సులు, రైళ్లతోపాటు దుకాణాలు, సూపర్మార్కెట్లు, రైతు బజార్లు, సినిమా థియేటర్లులాంటి బహిరంగ ప్రదేశాల్లోనూ కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంది. ప్రతిఒక్కరూ శానిటైజర్ వినియోగించడంతోపాటు మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలి. ఇప్పటికే పోలీసు శాఖ మాస్కులు ధరించని వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నది. రోడ్లపైకి మాస్కులు లేకుండా వచ్చే వాహనదారులు,
ఇతరులను గుర్తించి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తున్నారు. అయితే రెండేండ్లకంటే ఈసారి ప్రజల్లో పెరిగిన అవగాహన, కరోనాతో కలిగిన నష్టాలను గ్రహించడంవల్ల మాస్కులను ధరించి బయటికి వస్తున్నారు. ప్రభుత్వ శాఖలు కూడా ప్రజలతోకూడిన సమావేశాల నిర్వహణను విరమించుకున్నాయి. అలాగే కరోనా నివారణకుగానూ 18ఏండ్లు నిండిన వారికి రెండు డోసుల టీకా వేసే కార్యక్రమం కొనసాగుతున్నది. ఇప్పటికే మొదటిడోసు 99శాతం మందికి వేశారు. నాగర్కర్నూల్ జిల్లాలో 6,27,625మందికిగానూ 6,23,106మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. రెండోడోసు 3,63,071మందికి వేశారు. ఇక తాజాగా 15-18ఏండ్ల మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మొత్తమ్మీద కరోనా కట్టడికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతోపాటు అందరినీ అప్రమత్తం చేస్తున్నది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఈనెల 10వ తేదీవరకు ఆంక్షలు విధించింది. రాజకీయ పార్టీలు, సంఘాల సభలు, సమావేశాలు నిర్వహించరాదు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలి. మాస్కు లేకుంటే రూ.1000 జరిమానా విధిస్తాం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు నమోదు చేస్తాం.