లింగంపేట, డిసెంబర్ 20 : అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పష్టం చేశారు. లింగంపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ గరీబున్నీసా బేగం అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు సకాలంలో స్పందించడం లేదని, సమస్యలు పరిష్కారం కావడంలేదని సర్పంచులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారులు జవాబుదారీతనంతో పనులు చేయడంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నా రు. యాసంగిలో ధాన్యంకొనే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పినందున గ్రామాల్లో వరి పంట సాగు చేయకుండా చూడాలని సూచించారు. మండలంలోని పర్మళ్ల, శెట్పల్లిసంగారెడ్డి, భవానీపేట, ముంబాజీపేట గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించడం లేదని ఆయా గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై ఎమ్మెల్యే డీఈఈతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. మం డల స్థాయిలో విద్యుత్ శాఖ అధికారులు, సర్పంచులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఏఈ అజీజ్‌ను ట్రాన్స్ఫర్ చేయాలని డీఈఈకి సూచించారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రావడం లేదని ముంబాజీపేట ఎంపీటీసీ సభ్యుడు సర్వన్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కమీషన్ కోసం పనులు చేయవద్దని మిషన్ భగీరథ అధికారులపై మండిపడ్డారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్న గ్రామాల సర్పంచులకు నోటీసులు జారీ చేయాలని పంచాయతీ రాజ్ డీఈఈ గిరిని ఆదేశించారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విఠల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీవో శంకర్, సహకార సంఘం చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సురేందర్ అందజేశారు.