భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 31 : ఈ నెల 15వ తేదీ నాటికి నర్సింగ్ కాలేజీ మొదటి బ్లాక్ స్లాబ్ పనులను పూర్తి చేయాలని, రెండవ బ్లాక్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. శుక్రవారం నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులు, సమీకృత కలెక్టరేట్, అధికారుల నివాస సముదాయాల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో అందమైన పూల మొక్కలు నాటాలని చెప్పారు. స్లాబ్ వేసిన బ్లాక్లో బ్రిక్స్ పనులు నిరంతరాయంగా జరగాలని, మెటీరియల్ కొరత లేకుండా ముందస్తు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరులోగా నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులు పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందితో పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. పనుల పురోగతిపై రోడ్లు, భవనాలశాఖ అధికారులు, ఏజెన్సీలను అభినందించారు. అనంతరం కలెక్టరేట్ నిర్మాణ పనులు, అధికారుల నివాస సముదాయాలను కలెక్టర్ పరిశీలించారు. నిధుల కొరత లేదని, పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ ఈఈ భీమ్లా, డీఈ నాగేశ్వరరావు, తహసీల్దార్ స్వామి, సైట్ ఇంజినీర్ నరసింహారావు పాల్గొన్నారు.