కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 23: దేశ ఇంధన అవసరాల కోసం బొగ్గు రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని, మున్ముందు కేవలం ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలే బొగ్గు తీసే పరిస్థితి ఉండబోదని, ప్రైవేటు రంగం నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు, అధికారులు, యూనియన్ నాయకులు సమష్టిగా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అన్నారు. అంకితభావం, క్రమశిక్షణ కలిగిన సింగరేణీయులు తమ శ్రమశక్తితో ఇలాగే కష్టపడి పనిచేస్తే కంపెనీకి మరో వందేళ్ల పాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సందేశం ఇచ్చారు. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడితే ఏ కంపెనీకి భవిష్యత్తు ఉండదని, అలా ఆధారపడిన ఎన్నో కంపెనీలు నష్టాలతో మూతపడ్డాయని గుర్తు చేశారు. దేశంలోనే వందేళ్లలో ఎన్నో ప్రభుత్వ రంగ కంపెనీలు ఆవిర్భవించాయని, అలాగే నష్టాలతో మూతపడ్డాయని, సింగరేణి మాత్రం 13 దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థల కన్నా మిన్నగా పనితీరును కనపరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని వివరించారు. ముఖ్యంగా గత ఏడాదిన్నర కాలంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులను అధిగమించి ఈ ఏడాది రికార్డుస్థాయిలో 68 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశామన్నారు. 400 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాల సాధన దిశగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో లాభాలను సాధించనున్నట్లు చెప్పారు. ఒడిశా రాష్ట్రం చేపడుతున్న నైనీ బొగ్గు బ్లాక్ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని రానుందన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఒడిశా న్యూపాత్రపాద, నైనీ బ్లాకుల నుంచి ఏడాదికి 30 మిలియన్ టన్నులు ఉత్పత్తి కానున్నట్లు చెప్పారు. వచ్చే మూడేళ్లలో నూతనంగా ప్రారంభించనున్న 10 కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయితే కంపెనీ 100 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తిని సాధించగలుగుతుందని, వార్షిక టర్నోవర్ 30 – 40 వేల కోట్లకు చేరుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ మైనింగ్ డీఎన్ ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ సురేంద్రపాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సీఎం) జే.ఆల్విన్, జీఎం (కోఆర్డినేషన్) సూర్యనారాయణ, జీఎం మార్కెటింగ్ రవిప్రసాద్, జీఎం (స్టాటెజిక్ ప్లానింగ్) సురేందర్, సీఎంవోఐ జనరల్ సెక్రటరీ ఎన్వీ రాజశేఖర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.