ఖలీల్‌వాడి, డిసెంబర్ 24: కరోనా కట్టడికి నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో ఇప్పటివరకు 90శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశారు. ఇప్పటికే ఇంటింటా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించగా అన్ని పీహెచ్‌సీల్లో 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. మహారాష్ట్రలో 88 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజల్లో భయాందోళన మొదలైంది. మహారాష్ట్ర సరిహద్దును ఆనుకొని ఉన్న జిల్లా కావడంతో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాం గం అప్రమత్తమయ్యింది. అన్ని మండలాల్లో వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10లక్షల27వేల771 మంది ఫస్ట్ డోస్ తీసుకోగా, 6లక్షల54వేల291 మంది సెకండ్ డోస్ వేసుకున్నారు. ఇందులో కొవిషిల్డ్ 16,06,170 మందికి, కొవాగ్జిన్ 75,892 మందికి వేశారు. ఇప్పటి వరకు టీకా వేసుకున్న వారిలో 9లక్షల19వేల988 మంది మహిళలుండగా, 7లక్షల61వేల848 మంది పురుషులున్నారు. 18-44 ఏండ్ల వారు 9, 69,717 మంది, 45-60 ఏం డ్ల వారు 4,57,006 మంది, 60 ఏండ్లు పైబడిన వారు 2,55,339 మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేసుకుంటే ఒమిక్రాన్ వేరియంట్‌ను కట్టడి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. అందుకోసం 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుతున్నారు.
వ్యాక్సినేషన్ వేగిరం
ప్రజలకు కొవిడ్-19 నుంచి సంపూర్ణ రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నది. తండా నుంచి పట్టణం వరకు కరోనా టీకా పంపిణీ వేగవంతం చేసింది. మరోవైపు ఒమిక్రాన్ గుబులు పుట్టిస్తుండడంతో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రచారం జరుగుతుండడంతో టీకా వేసుకునేందుకు ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు.