ఫెయిలైన విద్యార్థులందరినీ కనీస మార్కులతో రాష్ట్ర ప్రభుత్వం పాస్చేసినట్లు ఇంటర్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల వెల్లడించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కామారెడ్డి జిల్లాలో 42 శాతం, నిజామాబాద్ జిల్లాలో 41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మొదటి సంవత్సరం విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ప్రకటించారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో జనరల్ విద్యార్థుల్లో 8891 మందికి గాను 3694 మంది పాసయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఫెయిలైన 5197 విద్యార్థులు కూడా పాస్ అయినట్లు తెలిపారు. వొకేషనల్లో 1141 మందికి గాను 527 మంది ఉత్తీర్ణులు కాగా.. ఫెయిలైన 614 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో జనరల్ విద్యార్థులు 16,484 మందికి గాను 6833 మంది విద్యార్థులు పాస్ కాగా.. ఫెయిలైన 9651 మందికి, వొకేషనల్లో 2213 మందికి గాను 1001 మంది ఉత్తీర్ణులు కాగా.. ఫెయిలైన 1212 మందికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఊరట కలిగిందని వివరించారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్లో విద్యార్థులు వంద శాతం పాస్ అయ్యారని పేర్కొన్నారు.