అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వ్యవసాయశాఖను సంస్కరణల బాట పట్టిస్తున్నది. గత కొన్ని పంట సీజన్ల నుంచి సాగు వివరాలను సేకరిస్తున్న ప్రభుత్వం.. ఇకపై ఆ లెక్కలను మరింత పక్కాగా చేపట్టనున్నది. పంటల వివరాలు సేకరించబోయే ఏఈవోలు తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో డిసెంబర్ మొదటి వారం నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు పొలం బాట పట్టారు. రైతులు ఏ పంటలు వేస్తున్నారు.. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. సాగు ప్రారంభించిన తేదీ వివరాలను క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో పక్కాగా నమోదు చేస్తున్నారు. వాస్తవ గణాంకాలు ఇవ్వకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నిజామాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో అనేక మార్పులను తీసుకువచ్చింది. రైతుకు మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖను గతంలో కన్నా మిన్నగా బలోపేతం చేసింది. క్షేత్ర స్థాయిలో సిబ్బంది కొరత లేకుండా వ్యవసాయాధికారులను నియమించింది. ప్రతి క్లస్టర్‌కు ఏఈవోలను ఏర్పాటు చేయడంతో రైతులకు వెన్నుదన్నుగా వ్యవసాయ శాఖ ఉండేలా చర్యలు చేపట్టింది. కొన్ని పంటల సీజన్ల నుంచి సాగు లెక్కలను ప్రభుత్వం సేకరిస్తున్నది. పంటల సీజన్ ప్రారంభమైన తర్వాత రైతులు ఏ పంటలు వేస్తున్నారు.. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే లెక్కలను గణించాలని వ్యవసాయ శాఖ ఆదేశాలిచ్చింది. అయితే… కొన్ని మండలాల్లో ఏఈవోలు కాకి లెక్కలతో విధులను ముగిస్తున్నారు. ఫీల్డ్‌కు రాకుండానే ఎక్కడో ఒక చోట కూర్చుని పంటల వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. తీరా దిగుబడులు వచ్చే సమయానికి భిన్న పంటల ఉత్పత్తులు అనేకం వెలుగు చూస్తున్నాయి. అప్పటికప్పుడు ప్రభుత్వానికి తగు ఏర్పాట్లు కల్పించడానికి కత్తి మీది సాములా మారుతోంది. ఈ నిర్లక్ష్యపు తంతుకు చరమగీతం పాడాలని యోచించిన సర్కారు.. పంటల సాగు లెక్కలకు అధునాతన సాంకేతికతను జోడించింది. ఇకపై పంటల వివరాలు సేకరించబోయే ఏఈవోలు తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలంటూ ఆదేశాలు రావడంతో కచ్చితమైన వివరాలు ఇకపై రాబోతున్నాయి.
తప్పుడు నివేదికలపై కఠిన చర్యలు
డిసెంబర్ మొదటి వారం నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు పొలం బాట పట్టారు. ఉన్నతాధికారులు సైతం స్వయంగా వివరాల సేకరణలో పాల్గొంటున్నారు. పొలాల్లోనే ట్యాబ్‌లతో ఫొటోలు తీసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా పంట విస్తీర్ణం, సాగు ప్రారంభంచిన తేదీ వివరాలను క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఈ వివరాలను పరిశీలించేందుకు ఉద్యాన శాఖ, సీపీవో, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. తప్పుడు వివరాలు నమోదు చేస్తే బాధ్యులపై ఈ బృందమే చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. అధికారులు ఒక చోట కూర్చుని సాగు వివరాలు నమోదు చేసే విధానానికి కొత్త పద్ధతిలో స్వస్తి పలికారు. దీంతో సరైన సాగు వివరాల నమోదుకు వీలు ఏర్పడుతుంది. ఏయే పంటల దిగుబడులు ఎంత మేరకు వస్తాయో మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు వ్యవసాయ శాఖ అంచనా వేయడం సులభతరం కానునున్నది. పంటల దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు, అవసరమైన సంచుల సరఫరా, రైతులకు చెల్లించే మద్దతు ధరకు అనుగుణంగా నిధులు కేటాయింపులపై స్పష్టత వచ్చి ప్రభుత్వం ముందస్తుగా సన్నద్ధం అవుతుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన దిగుబడులు, ఉత్పత్తులకు అవసరమైన గోదాములను అందుబాటులో ఉంచేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ఇతర పంటల సాగు…
యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలంటూ ప్రభుత్వం కొద్ది కాలంగా ప్రచారం చేస్తోంది. వ్యవసాయ శాఖ సైతం విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ప్రభుత్వ చర్యలు అక్కడక్కడ ఫలితాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. వరి సాగు చేస్తున్న రైతులంతా ప్రైవేటు వ్యాపారులు, ఆయా విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న వారు మాత్రం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయా సంస్థల నుంచి బైబ్యాక్ ఒప్పందాలు లేని వారంతా వరికి బదులుగా ఇతర పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా అపరాల సాగుకు చాలా మంది రైతులు మొగ్గు చూపుతుండగా కొద్ది మంది ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నట్లు కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న క్రాప్ బుకింగ్‌లో తేలినట్లుగా వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. పప్పు దినుసులు, కూరగాయల సాగుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తున్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలకు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు. యాసంగిలో నీటికి ఢోకా లేకపోవడంతో భారీగానే పంటలు సాగయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.
జియో ట్యాగింగ్ తప్పనిసరి
పంటల సాగు లెక్క పక్కాగా చేపడుతున్నారు. సాగు లెక్కల్లో తేడా ఉండడంతో పంట ఉత్పత్తులు, విక్రయాల సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో సాగు చేసే పంట పొలాలకు జియో ట్యాగింగ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ లెక్కలు పక్కాగా ఉండేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వ్యవసాయాధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను స్వయంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దిగుబడుల వివరాలను ఆన్లైన్లో పక్కాగా పొందుపర్చాల్సి ఉం టుంది. దీంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, చేతి కొచ్చే పంట ఉత్పత్తుల సమాచారం లెక్కలు తేడాలేకుండా కచ్చితంగా ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో యా సంగిలో సుమారుగా 11లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి ధాన్యం దిగుబడులు వచ్చాయి. కానీ గత అంచనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యవసాయాధికారుల అంచనాలు ఏటా తప్పుల తడకగా ఉండడంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో వివరాలను సేకరించాలని ఏఈవోలను ఉన్నతాధికారులు ఆదేశించారు. వీరికి తోడుగా మండల వ్యవసాయ అధికారులతో పాటు ఏడీలకు సర్వే బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వం సూచించిన సర్వే నంబర్లలో ఏ పంట వేశారనేది పరిశీలించి, పంట ఫొటో తీసి, జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంది. ఏఈవోలు నమోదు చేస్తున్న వివరాలతో మండల, డివిజన్ స్థాయి అధికారులు సాగు లెక్కలను సరి చూడనున్నారు.