రైతు వ్యతిరేక విధానాలను అవంలబిస్తున్న కేంద్రం తీరుపై మరోమారు లడాయికి టీఆర్ఎస్ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీ తీరుకు నిరసనగా సోమవారం గ్రామగ్రామాన టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలంతా నాయకులను ఇప్పటికే సమాయత్తం చేశారు. ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడిగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు మోదీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రుల బృందం, టీఆర్ఎస్ ఎంపీలు శనివారమే ఢిల్లీకి పయనమయ్యారు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్తో పాటు రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి ఉన్నారు.
నిజామాబాద్, డిసెంబర్ 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ ద్వంద్వ నీతిని ఎండగట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ప్రజల్లో తేటతెల్లం చేసేందుకు శ్రేణులంతా రెడీ అయ్యారు. సోమవారం ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నా రు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చావు డప్పు నిర్వహించనున్నారు. కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ బాధ్యులతో పాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడిగా ఆందోళన చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు మోదీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయనున్నారు. రాష్ట్ర రైతన్నల గోసను పట్టించుకోకుండా బీజేపీ ప్రభు త్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించబోతున్నది. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర సర్కారు మెడలు వంచేందుకు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ దండు కదలనున్నది. రోడ్డెక్కి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు.
రైతులను ఆగం చేస్తోన్న మోదీ సర్కారు…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రైతుల పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ధాన్యం కొనబోమని పదే పదే ప్రకటిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనే పరిస్థితు లు లేకుండా పోయింది. రాష్ట్రంలో వచ్చే సీజన్ ముగింపు నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సైతం ఏర్పాటు అయ్యే అవకాశాలు లేవు. కేంద్రం మొండి వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్రంలో ని కోట్లాది మంది రైతులు అయోమయానికి గుర య్యే పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఏటా ప్రతి సీజన్లో ధాన్యాగారంగా నిలుస్తున్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ వరి సాగు నిలిచి పోవాల్సిన గత్యంతరం కేంద్రం మూలంగానే ఏర్పడింది. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ… ఇంతటి ఘోరమైన దుస్థితికి కారణమైన బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం గ్రామగ్రామాన తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సంస్థాగతంగా జాతీయ పార్టీలకన్నా మిన్నగా బలోపేతమై న టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రతి గ్రా మంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగనున్నాయి. ఇప్పటికే కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులను ఇప్పటికే సమాయత్తం చేశారు.
ఢిల్లీకి వేముల ప్రశాంత్ రెడ్డి…
రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బ తీయాలని చూస్తుంటే ఊరుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. కుట్రలను ఛేదించేందుకు కేంద్రంతో ఎంతటి కొట్లాటకైనా సిద్ధమని కేసీఆర్ చెప్పడంతో గులాబీ నేతలంతా ఆందోళనలకు సిద్ధమయ్యారు. తెలంగాణ సమాజం సహనాన్ని బలహీనతగా భావిస్తున్న కేంద్ర సర్కారుకు తగిన గుణపాఠం నేర్పేందుకు రాష్ట్ర రైతులు సైతం నడుం బిగించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు శనివారమే రాష్ట్ర మంత్రు ల బృందం, టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీకి పయనం అయ్యారు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం కేంద్ర పెద్దలతో చర్చలు జరిపేందుకు వెళ్లారు. మంత్రి వెంట జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్తో పాటు రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి సైతం ఉన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఒక మాట, రాష్ట్ర బీజేపీ నేతలు మరో మాట మాట్లాడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడే బీజేపీ తీరును ప్ర జల్లో బట్టబయలు చేయాలని ఆదేశించారు. యా సంగిలో ధాన్యం కొనబోమని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యా సంగిలో ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా తెరవబోదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకపోనున్నారు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమనే విషయాన్ని రైతులకు వివరించబోతున్నారు.
రోడ్డెక్కనున్న గులాబీ దండు…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలోనూ బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. ఎమ్మెల్యేలంతా కేసీఆర్ ఆదేశాలతో ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గ్రామాలు, మండల కేం ద్రాలతో పాటు నిజామాబాద్ అర్బన్లోనూ ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఏడాదిన్నర కాలంలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం కుట్రలకు పాల్పడుతున్నది. ఇచ్చిన హామీలకు విరుద్ధంగా రాష్ట్రం నుంచి బియ్యం సేకరణకు మోకాలడ్డుతున్నది. అంతేకాకుండా కుంటి సాకులతో ఉప్పుడు బియ్యాన్ని తరలించకుండా తాత్సారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా పాటుపడుతున్నారు. రైతుబంధు, రైతుబీమాతో పాటుగా ఉచిత కరెంట్, సాగు నీటి వసతులతో రైతుకు వెన్నుదన్నుగా నిలిచారు. రైతుల మద్దతును కూడగట్టుకున్న టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చాలనే బీజేపీ ప్రభుత్వం పక్కా రాజకీయం చేస్తూ అమాయకులైన రైతును బలి చేస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
గన్నారం వద్ద నిరసన కార్యక్రమం
ఇందల్వాయి, డిసెంబర్ 19 : కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం కమాన్ వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో అన్ని మండలాల నాయకులు పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రం దిగి వచ్చే వరకు ఉద్యమం
రెంజల్, డిసెంబర్ 19 : ఒక వైపు రైతు శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. కేంద్రం మొండి వైఖరిని ఎండగడుతూ ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడుతాం.
-కాశం సాయిలు, రైతుబంధు సమితి మండల కన్వీనర్, రెంజల్
కేంద్రం మెడలు వంచుతాం
అన్నదాతల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో కేంద్రం మెడలు వంచుతాం. సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతాం.
మౌలానా, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్, తాడ్బిలోలి గ్రామం
అన్నదాతకు అండగా ఉంటాం..
కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నది. ధాన్యం కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతాం. పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి.
-బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్