పిల్లల అభిరుచిని తల్లిదండ్రులు గుర్తించి, ప్రోత్సహిస్తే.. ఆయా రంగాల్లో వారు తప్పకుండా రాణిస్తారు. మంచి శిక్షణ ఇప్పిస్తే.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారు. ఇందుకు నిదర్శనమే నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలానికి చెందిన బాలిక సాయి ప్రజ్ఞ. ఈత పట్ల చిన్నారి సాయి ప్రజ్ఞకు ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు శిక్షణ ఇప్పించారు. ఇప్పటి వరకు సుమారు 44 పతకాలు గెలిచి ఈతలో మేటిగా నిలుస్తున్నది సాయి ప్రజ్ఞ.
ఎడపల్లి (శక్కర్‌నగర్), డిసెంబర్ 18: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన తూటుకూరు సునీత-గోవర్ధన్ దంపతుల కూతురు చిన్నారి సాయిప్రజ్ఞ. హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ కంపెనీలో గోవర్ధన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, ఆయన భార్య సునీత ఓ ప్రైవేటు కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న సాయిప్రజ్ఞకు ఎనిమిదేండ్ల వయస్సు నుంచే ఈత అంటే ఆసక్తి ఎక్కువ. దీంతో తల్లిదండ్రులిద్దరూ చిన్నారిని అక్కడే ఉన్న జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో చేర్పించారు. కోచ్ జాన్ సిద్ధిఖీ వద్ద స్విమ్మింగ్‌లో మెళకువలు నేర్చుకుంటూ బ్రెస్ట్ స్ట్రోకర్గా ప్రావీణ్యం సాధించింది. ఈతలో శిక్షణ పొందిన సాయిప్రజ్ఞ ఇప్పటి వరకు నిర్వహించిన పలు పోటీల్లో పాల్గొని 44 పతకాలు సాధించింది.
నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో చాంపియన్‌గా …
గత నెల గోవాలో నిర్వహించిన ఫస్ట్ ఫిన్ స్విమ్మింగ్ నేషనల్ పోటీల్లో సాయి ప్రజ్ఞ తన సత్తాను చాటి చాంపియన్‌గా నిలిచింది. 50 మీటర్ల అండర్ వాటర్ చాలెంజ్‌ను 26 సెకండ్లలో పూర్తిచేసింది. ఈ పోటీల్లో చాంపియన్‌గా నిలిచిన సాయిప్రజ్ఞకు గోవాలో అండర్ వాటర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సర్వేశ్ ప్రణబ్, కార్యదర్శి డాక్టర్ తపన్ కుమార్ పాణిగ్రాహి పతకాన్ని అందజేసి సత్కరించారు. ఇదే పోటీల్లో మూడు బంగారు పతకాలు, ఒక వెండి పతకాన్ని సాధించింది.
జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు..
ఎనిమిదేండ్ల వయస్సు నుంచి స్విమ్మింగ్ (బ్రెస్ట్ స్ట్రోకర్)లో శిక్షణ పొందుతూ పలు పోటీల్లో పాల్గొన్న సాయి ప్రజ్ఞ తన ప్రతిభను చాటింది. 2017లో కరీంనగర్లో నిర్వహించిన 3వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో బంగారు, వెండి పతకాలను కైవసం చేసుకున్నది. 2019లో జీహెచ్ఎంసీ స్విమ్మింగ్‌పూల్ సికింద్రాబాద్‌లో నిర్వహించిన సబ్ జూనియర్, జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని వెండి, కాంస్య పతకాలను సాధించింది. 6వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ -2020, స్పోర్ట్స్ అకాడమీ హైదరాబాద్ నిర్వహించిన పోటీల్లో ఒక బంగారు పతకంతోపాటు మూడు వెండి పతకాలను సాధించింది. 2019లో హైదరాబాద్‌లోని డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన ఇంటర్ స్కూల్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభచాటిన సాయిప్రజ్ఞ రెండు బంగారు, రెండు వెండి పతకాలు గెలుచుకున్నది. 2019లో కోయంబత్తూర్‌లోని మెట్టుపాలాయంలో నిర్వహించిన సీబీఎస్ఈ స్కూల్ గేమ్స్ సౌత్‌జోన్ స్విమ్మింగ్ పోటీల్లో ఓ కాంస్య పతకాన్ని సాధించింది. ఇలా పలుమార్లు స్మిమ్మింగ్ పోటీల్లో పాల్గొని 44 పతకాలు సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేస్తున్నది.
మరిన్ని విజయాలు సాధిస్తా..
చిన్నప్పటి నుంచి నాకు ఈత అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని గుర్తించిన మా తల్లిదండ్రులు నాకు శిక్షణ ఇప్పించారు. ఇప్పటి వరకు పలు పోటీల్లో పాల్గొని విజయాలు సాధించా. నాలోని పట్టుదలను ప్రోత్సహిస్తూ, స్విమ్మింగ్‌లో శిక్షణనిస్తూ వెన్నంటి ఉంటున్న కోచ్ జాన్ సిద్ధిఖీ, తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో మరిన్ని పోటీల్లో పాల్గొని విజయాలు సాధిస్తా..
-సాయి ప్రజ్ఞ