రైతుబంధు పంపిణీలో భాగంగా రూ.50వేలకోట్ల రికార్డు మార్కు దాటిన సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించారు. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు జేజేలు పలికారు. రైతువేదికలు, ప్రాథమిక సహకార సంఘాల వద్ద నిర్వహించిన సంబురాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. పలుచోట్ల ఉత్తమరైతులను ప్రజాప్రతినిధులు సన్మానించారు. వేడుకలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.
ఉమ్మడి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రైతుబంధు పథకం కింద అన్నదాతలకు అందించిన మొత్తం రూ.50వేల కోట్ల మైలురాయిని చేరుకోనున్న సందర్భంగా ఆదివారం ఊరూరా ఎడ్లబండ్లు, ్రట్రాక్టర్లతో రైతులు, ప్రజాప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. రైతువేదికల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ఎళ్లవేళలా రుణపడి ఉంటామన్నారు.