
మహబూబ్‌నగర్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ సంసిద్ధంగా ఉండేలా స్థానికంగానే మెరుగైన వైద్యం అందించేందుకు మ హబూబ్‌నగర్, జడ్చర్లకు కలిపి 32 పిల్లల కొవిడ్ యూనిట్లు మంజూరైనట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శనివారం ప్రకటనలో తెలిపారు. తాను, ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కోరిన వెంటనే సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లాకు కొత్తగా ఫస్ట్ బెడ్ కొవిడ్ పిల్లల యూనిట్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సిబ్బంది, వైద్యులు, బడ్జెట్ కూడా విడుదల చేసినట్లు చెప్పారు. మహబూబ్‌నగర్ వైద్యరంగంలో ఏడేండ్లలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. 2014కు ముందు మహబూబ్‌నగర్ దవాఖానలో ఒక్క ఐసీయూ బెడ్ కూడా లేదని, ఈ ఏడేండ్లలో 550కి పైగా ఆక్సిజన్ బెడ్లతోపాటు 67 ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ ప్లాంట్, ఎంఆర్ఐ, డయాగ్నోస్టిక్ సెంటర్, ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్పొరేట్ మాదిరిగా ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పాత కలెక్టరే ట్ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ లో వైద్యం కోసం మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని, అవసరమైతే హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు వచ్చేలా సకల సౌకర్యాలతో జనరల్ దవాఖానను తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు పూర్తి భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు.