టెండర్లు వచ్చిన వారితో పాత దుకాణదారుల పైరవీలు
కొత్త వారికి చిక్కుగా మారుతున్న ‘అడ్డా’
షాపు షురూ చేసినా.. చేయకపోయినా.. లైసెన్స్ ఫీ చెల్లించాల్సిందే..
డిసెంబరు 1 నుంచి కొత్త వైన్స్ దుకాణాలు
బంజారాహిల్స్, నవంబర్ 27 : ఇటీవల వైన్స్ షాపుల కోసం జరిగిన లాటరీలో టెండర్లు దక్కించుకున్న వారు సంతోషంతో దుకాణం ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయినప్పటికీ పరిస్థితులు మరోలా ఉన్నాయి. మద్యం షాపులు దక్కించుకుని కొత్త షాపులు ఏర్పాటు చేయడంలో వారంతా బిజీగా ఉన్నారు. టెండర్లు దక్కించుకున్న చాలా మందికి దుకాణాలు దొరికే పరిస్థితులు లేవు. దొరికినా కొత్త ప్రాంతంలో దుకాణాలు ఏర్పాటు చేస్తే వినియోగదారులకు త్వరగా తెలిసే పరిస్థితులు ఉండవనే మీమాంసలో ఉన్నారు. గత కొంత కాలంగా దుకాణాలు నిర్వహిస్తున్న వారు ఆ దుకాణాలను కొత్త వారికి ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటి వరకు మద్యం దుకాణంగా ఆదరణ పొందిన ఆ దుకాణాలైతే వినియోగదారులకు కొత్తగా వెతుక్కోవాల్సిన పని ఉండదు. దుకాణాదారులకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుందని పలువురు ఆలోచిస్తున్నారు. అయితే, నగరం వెస్ట్‌జోన్ పరిధిలో అత్యంత ఆదరణ పొందిన మద్యం దుకాణాల యాజమానులు టెండర్లు దక్కించుకున్న వారితో ప్రస్తుతం మంతనాలు జరుపుతూ వారిని మభ్యపెడుతూ టెండర్లు తమవిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యాపారంలో ఉన్న వారిలో చాలా మందికి ఈసారి మద్యం లాటరీలో టెండర్లు దక్కకపోవడంతో వేరే వారికి వచ్చిన లైసెన్స్‌లపై ఆధారపడి నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు వారిని నయానో భయానో ఒప్పించేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లైసెన్స్‌లు పొందిన వారితో పెద్ద ఎత్తున మంతనాలు కొనసాగిస్తున్నారు. టెండర్లు దక్కించుకున్న వారికి దుకాణాలు నిర్వహించుకునేందుకు పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో, టెండర్లు దక్కించుకున్న వారిలో కొంతమంది ఎంతో కొంత గుడ్‌విల్‌గా పొంది లైసెన్స్‌ను వేరేవాళ్లకు ఇచ్చి లాభాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా, సొంతంగా షాపులు ఏర్పాటు చేయాలనుకునేవారికి అడ్డాలు దొరకడం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. దుకాణాల నిర్వహణపై అవగాహన లేక చాలా మంది టెండర్లు పొందిన వారు ఎంతకో కొంతకు అమ్మేసుకుంటున్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట ప్రాంతాల్లోని కొన్ని షాపులను ఏర్పాటు చేసేందుకు అడ్డాలు దొరక్కపోవడంతో లైసెన్స్ హోల్డర్ల పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనక గొయ్యి’ అనే చందంగా మారింది. ఈనెలాఖరు వరకు అడ్డాను సంపాదించి షాపును ఏర్పాటు చేయాల్సి ఉంది. లేకుంటే డిసెంబర్ 1 నుంచి షాపు నడిచినా, నడవక పోయినా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిందేనని వారు ఆందోళన చెందుతున్నారు. కాగా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్ ప్రాంతాల్లో ఇప్పటికే అడ్డాలు చేతిలో ఉన్నవారికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి దాకా ఆయా షాపులను అద్దెకు ఇచ్చిన వారు ఇప్పుడు పార్టనర్షిప్ ఇస్తారా? లేక తాము చెప్పిన రేటుకు లైసెన్స్ ఇస్తారా? అంటూ బేరసారాలు చేస్తున్నారు. ప్రారంభంలో తమకు లైసెన్స్ వస్తే భారీగా గుడ్‌విల్ పొందొచ్చనే ఉద్దేశంతో ఉన్న లాటరీ విజేతల ఆశలు అడ్డాలు దొరక్కపోవడంతో నీరుగారుతున్నా యి. తాము పెట్టిన పెట్టుబడి వస్తే చాలనే ఉద్దేశంతో చాలామంది లైసెన్స్ విజేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అడ్డాలు చేతిలో ఉన్న వారికి మాత్రం ఈ మొత్తం వ్యవహారం అనుకూలంగా మారింది. కొత్త ప్రదేశంలో వైన్స్ ఏర్పాటుకు అనేక విధాలైన అడ్డంకులు ఉండటంతో పాత వారికే తమ లైసెన్స్ అమ్మితే మేలనే ఉద్దేశంతో లైసెన్స్ పొందిన వారున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్, అమీర్‌పేట క్లస్టర్‌లోనే సుమారు 6 నుంచి 7 లైసెన్స్‌లకు అడ్డాలు లేకపోవడంతో వారు నానా ఇక్కట్లకు గురవుతున్నారు.