స్మార్ట్‌సిటీతో సరికొత్తగా మారుతున్న కరీంనగర్‌కు కొత్త కలెక్టరేట్ రాబోతున్నది. ప్రస్తుతమున్న పాత భవనం పక్కన ఆధునిక వసతులతో నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇప్పటికే మంజూరు ఇవ్వగా, మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా బుధవారం నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి భూమి పూజ జరుగనున్నది. 51 కోట్లతో చేపట్టే ఈ నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని యంత్రాంగం భావిస్తున్నది. కొత్త జిల్లాల కలెక్టరేట్ భవనాలకు దీటుగా అధునాతన హంగులతో నిర్మించనుండగా, ఇది పూర్తయితే అన్ని శాఖల కార్యాలయాలు ఒకే చోటికి రావడంతోపాటు ప్రజలకు పాలన మరింత చేరువకానున్నది.
కరీంనగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ పాత కలెక్టరేట్ ఏర్పాటు చేసి నాలుగు దశాబ్దాలు గడిచిపోయింది. గత ప్రభుత్వాలు మరమ్మతుకు నిధులు ఇవ్వకపోవడంతో పలు బ్లాక్‌లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. మూడేళ్ల క్రితం రోడ్డు భవనాల శాఖ ప్రస్తుత కలెక్టరేట్ భవన పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ మేరకు.. కొన్ని డబ్బులు వెచ్చించి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. అయినా పరిస్థితి మారలేదు. వర్షం పడితే చాలు అనేక చోట్ల బిల్డింగ్ ఉరుస్తున్నది. చాలా సందర్భాల్లో కంప్యూటర్లు చెడిపోయాయి. ఫైల్లు తడిసిపోయాయి. కొన్ని చోట్ల స్లాబ్ కింది భాగం పెచ్చులూడి కింద పడుతున్నది. వీటిన్నంటినీ పరిగణనలోకి తీసుకొని మంత్రి గంగుల కమలాకర్.. పాత కలెక్టరేట్ దుస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి గతంలోనే తీసుకెళ్లారు. ఆ మేరకు కలెక్టరేట్లో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కరీంనగర్‌కు కొత్త కలెక్టరేట్ భవనం అవసరముందని సీఎం గతంలోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో రోజురోజుకూ శిథిలావస్థకు చేరుతున్న కలెక్టరేట్ స్థానంలో కొత్త జిల్లాల మాదిరిగా అధునాతన కలెక్టరేట్ ఏర్పాటుచేయాలని మంత్రి గంగుల మరోసారి ముఖ్యమంత్రిని కోరారు. ఆ మేరకు తాజాగా సీఎం పచ్చ జెండా ఊపారు. నిర్మాణం చేసుకోవడానికి ఆమోద ముద్ర వేశారు.
పాత కలెక్టరేట్ పక్కనే ఏర్పాటు..
జిల్లాకేంద్రం నడిబొడ్డున ఉన్న ప్రస్తుత కలెక్టరేట్ ప్రజలందరికీ అందుబాటులో ఉంది. కొన్ని దశాబ్దాల పాటు ఉమ్మడి జిల్లాలకు కలెక్టరేట్‌గా ఉపయోగ పడింది. అయితే అందులో స్థలం సరిపోక పోవడం వల్ల వివిధ విభాగాలకు చెందిన 32కు పైగా శాఖలు జిల్లాకేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత వివిధ శాఖలు ఖాళీ అయ్యాయి. దాంతో బయట ఉన్న పలు శాఖలకు పాత కలెక్టరేట్లో వసతులు కల్పించారు. అయితే భవనం శిథిలావస్థకు చేరడంతో సదరు శాఖలు అందులో కొనసాగడం ఇబ్బందిగా మారింది. అంతేకాదు, ఇప్పటికీ ఇంకా 12కుపైగా ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వేర్వేరు ప్రాంతా ల్లో ఉన్నాయి. దీని వల్ల ప్రజలు ఆయా కార్యాలయాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖలు ఒకే చోట ఉండేలా భవన సముదాయాన్ని నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కొత్త కలెక్టరేట్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అంటే.. రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లిలో కొత్త కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం జరిగింది. పెద్దపల్లి, జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించాల్సి ఉంది. కాగా, కరీంనగర్లో స్మార్ట్ సిటీ కింద రోడ్లు అద్భుతంగా మారుతున్నాయి. కొత్త పార్కులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా కలెక్టరేట్ ఏర్పాటు చేయడం కూడా అవసరమని భావించిన ప్రభుత్వం నిర్మాణానికి అనుమతినిచ్చింది.
నేడు భూమి పూజ..
కొత్తగా ఏర్పాటు చేయనున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయానికి బుధవారం మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేయనున్నారు. ప్రస్తుతమున్న కలెక్టరేట్ పక్కన హెలిప్యాడ్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అందుకు అధికారయంత్రాగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ భవన సముదాయాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని మంత్రి గంగుల తెలిపారు. కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని కట్టుకోవడానికి సీఎం అనుమతివ్వడం సంతోషకరమైన విషయమని చెప్పారు. తమ విజ్ఞప్తిని మన్నించి ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.