యాదాద్రి, జనవరి7 : ఉమ్మడి నల్లగొండ సహకార బ్యాంకు రూ.10 కోట్ల లాభాల బాటలో నడుస్తున్నదని జాతీయ సహకార సమాఖ్య మండలి చైర్మన్, రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో టెస్కాబ్ వైస్ చైర్మన్, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన టెస్కాబ్ పాలక మండలి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకు సేవలు అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూలేని విధంగా ప్రతిభ గల రైతుబిడ్డల విదేశీ చదువులకు విద్యా రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, గృహ రుణాలు, మహిళా సంఘాలు, బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. సాంకేతికతను వినియోగించుకుని రైతులకు మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. టెస్కాబ్ దేశంలో అగ్రగామిగా నిలిచిందని, బ్యాంకుకు జాతీయ ఉత్తమ అవార్డు వరించిందని తెలిపారు. ఎన్డీసీసీబీ అభివృద్ధిలో చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి కృషి అభినందనీయమన్నారు. త్వర లో సహకార బ్యాంకుల్లో అధికారుల బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న డెయిరీ, పౌల్ట్రీ, కూరగాయలు, పండ్ల పంటలకు ప్రోత్సాహక రుణాలను అందిస్తున్నామని చెప్పారు. నాబార్డు సహకారంతో సొసైటీల్లో మల్టీ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల చైర్మన్లు నిజాం పాషా, రఘునందన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, పోచారం భాస్కర్‌రెడ్డి, మారినేని రవీందర్రావు, టెస్కాబ్ ఎండీ నేతి మురళీధర్, నాబార్డు సీజీఎం వైకే రావు, ఆర్సీఎస్ ప్రతినిధి డాక్టర్ ప్రసన్న, ఫ్రొఫెషనల్ డైరెక్టర్లు మోహనయ్య పాల్గొన్నారు.