సిద్దిపేట, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి సాగు ప్రారంభం కాగానే ఒక గుంట భూమి ఉన్న రైతును మొదలు కొని, పట్టా భూమి ఉన్న ప్రతీ రైతుకు రైతుబంధు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. తొలి రోజు ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులు నేరుగా జమ అయ్యాయి. రెండో రోజూ రెండు ఎకరాలు, మూడో రోజూ గురువారం మూడు ఎకరాల భూమి ఉన్న వారికి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడ్డాయి. దీంతో పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు డబ్బులను నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంక్ఖాతాలోనే జమ అవుతున్నాయి. దీంతో రైతులు సంబురంగా సాగు పనుల్లో నిమగ్నమవుతన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వని విధంగా యావత్తు దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా సీఎం కేసీఆర్ అడగక ముందే రైతుబంధు డబ్బులను వేస్తున్నారు. దీంతో రైతులు గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నాడని తెలిపారు. ఎప్పటికి సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని రైతులు తెలుపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేసేది ఏం లేదుగానీ, రాష్ట్ర ప్రభుత్వం విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీలపై రైతులు మండిపడుతున్నారు. యాసంగిలో ధాన్యం కొనేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి, ధాన్యం కొనేలా చేయాలని బీజేపీ నాయకులను రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సాయం మరువలేనది
సర్కారు పెట్టుబడి సాయం అందించడం ఎంతో ఆనందంగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మళ్లీ వ్యవసాయం చేసుడు మొదలు పెట్టిన. అంతకు ముందు వ్యవసాయం చేసినా అప్పులపాలయ్యేది. ఇప్పుడు ఆ బాధ లేకుంటా చేసిండు సీఎం కేసీఆర్ సారు. నాకు భూమి ఉన్నంత వరకు రైతు పెట్టుబడి సాయం అందించడంతో రైతులకు బయట వ్యాపారుల వద్దకు వెళ్లకుండా రైతుబంధు డబ్బులు ఎంతో ఉపయోపగపడుతున్నాయి. పెట్టుబడి సాయం అందజేస్తున్న సర్కారును ఎప్పుడూ మరువం.
రైతు బంధు పైసలొచ్చినప్పటి నుంచి ఎవుసం నేనే సేసుకుంటున్న. ఇది వరకు కౌలుకు ఇత్తుంటి. రైతుబంధు పైసలు దున్నడానికి పోను పెట్టుబడులకు వాడుకుంటున్న. మునుపటి లెక్క ఎవసం కోసం ఎవలదగ్గరికీ పోతలేను. సీఎం కేసీఆర్ నాకు దేవుడు.. నేను సచ్చే దాకా రుణపడి ఉంటా. నా భర్త సచ్చిపోయినంక పాస్బుక్కు ఇయ్యమంటే రూ. 30 వేలు అడిగిండ్రు. చేతుల పైసలు లేక పాస్బుక్కు తెచ్చుకోలే. సీఎం కేసీఆర్ సార్ వచ్చినంక రూపాయి కర్సులేకుండా నాకు పాసుబుక్కు ఇచ్చిండు. రైతుబంధు పైసలు ఇచ్చిండు. ఇదివరకు కౌలుకి పోయి బతికేదాన్ని. ఎవలు ఏ పని జెప్పినా, ఆ పనికి పోయి బతికేదాన్ని. ఆయన దయవల్లనే వానకాలం ఆరువై వేల రూపాయల వడ్లు పండినయి. నేను నా ఇద్దరం కొడుకులు మంచిగ బతుకుతున్నం. ఇప్పటికీ ఇరువై గుంటల పెసర్లు అలికిన. ఇన్ని సన్నపు వడ్లు పోసుకున్న. కొన్ని నువ్వులు కూడా పెడుతాన్న. నా జీవితం మంచిగయిందంటే కేసీఆర్ సార్వల్లనే.
మందు బస్తాలు తెచ్చిన.. నాటు ఏస్తున్నా..
రైతుబంధు పైసలు ఖాతల పడ్డయి.. మందు బస్తాలు కొన్కుకొచ్చిన.. నాటు ఏస్తున్న.. సీఎం కేసీఆర్ సారు ఎకరానికి 10వేలు ఇచ్చుకుంటూ రైతులకు ఎంతో మేలు జేస్తున్నడు. సీఎం సారు డ్యాంలు కట్టడడంతో నీళ్లు బాగానే పెరిగినయి. సారు చేసిన మంచి పనులతో ఇప్పుడు ఎవుసం చేసుకుంటూ పనులు చూసుకుంటున్నాం. మా తాతల కాలం నుంచి ఎవుసం జేస్తున్నం. రైతు కోసం పని చేసిన సర్కారోల్లను జూడలేదు. సీఎం కేసీఆర్ సల్లగా ఉండాలె. గిప్పుడు నాటేస్తున్న వడ్లు కొనేందుకు ఏదైనా దారి చూడాలే.
మర్కూక్ : గంగాపూర్ లో ఎకరం భూమి ఉన్నది. రైతుబంధు ప్రారంభం నుంచి పైసలు బ్యాంకులో పడుతున్నాయి. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదు. కరెంటు ఉంటే నీల్లు ఉండకపోయేవి. ఎరువులు, విత్తనాలు కోసం మస్తు.. తిప్పలైయేది. తెలంగాణ వచ్చాకా.. మా బాధలన్నీ పోయినాయి. రైతులను దేవునోలె ఆదుకుంటుంన్నడు. -దేవి నర్సింహులు, గంగాపూర్
మూడు రోజుల్లో 6,52,823 మంది రైతులకు రూ.408.24 కోట్లు జమ
రాష్ట్ర ప్రభుత్వం మూడో రోజు ఉమ్మడి జిల్లాలోని 1,32,398 మంది రైతుల వ్యక్తి గత బ్యాంక్ ఖాతాలోరూ.162,47,72,130 వేసింది. సిద్దిపేట జిల్లాలో 49,487 మంది రైతులకుగాను రూ.60,28,68,744,మెదక్ జిల్లాలో32,792 మంది రైతులకుగాను రూ.39,80,14,159, సంగారెడ్డి జిల్లాలో50,119 మంది రైతులకుగాను రూ.62,38,89,227 సర్కారు డబ్బులు జమా చేసింది. ఈ మూడు రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 6,52,823 మంది రైతులకు గాను రూ.408,24,41,172 వేశారు. కాగా, మూడో రోజూ ముడు ఎకరాల్లోపు రైతులందరికీ డబ్బులు పడగా, సీఎం కేసీఆర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.