
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మూడో వంతుమెజార్టీ మాకే ఉంది..
రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం మాది..
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది బీజేపీ..
మెదక్ జిల్లాలో ఇప్పటికే 50శాతం ధాన్యం కొనుగోలు
మీడియాతో మంత్రి హరీశ్‌రావు
మెదక్, నవంబర్ 23 : ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయఢంకా మోగించడం ఖాయమని, టీఆర్ఎస్కు మూడోవంతు మెజార్టీ ఉందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి నామినేషన్ దాఖలు అనంతరం మంగళవారం మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. ఎంతమంది నామినేషన్లు వేసినా టీఆర్ఎస్ అభ్యర్థి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ యాదవరెడ్డి గెలుపు తథ్యమని, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని ఓటు వేయించాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని మంత్రి విమర్శించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించడం ఖాయమని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడి యా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడో వంతు మెజార్టీ టీఆర్ఎస్కే ఉంద ని, ఎంతమంది నామినేషన్లు వేసినా టీఆర్ఎస్ అభ్యర్థి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ యాదవరెడ్డి నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్కు దాదాపు 777 మంది ప్రజాప్రతినిధులు, ఓటర్లు ఉన్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీ నాయకులకు కేవలం 250 ఓట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. దీంతో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందని అన్నారు. ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని ఓటు వేయించాలని సూచించారు. టీఆర్ఎస్ సర్కారు రైతు సంక్షేమానికి కృషి చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ సర్కారు
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మెదక్ జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే, ఇప్పటికే 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రూ.50 కోట్ల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. గత యాసంగి బాయిల్డ్ రైస్ 30శాతమే పోయిందని, ఇంకా 70శాతం గోదాములు, మిల్లుల్లో మూలుగుతున్నదని, రైతుల మీద ప్రేమ ఉంటే రైల్వే శాఖతో మాట్లాడి రేక్స్ పెట్టించాలని, ఎఫ్‌సీఐతో మాట్లాడి గత యాసంగిలో నిల్వ ఉన్న బియ్యాన్ని తరలించాలని బీజేపీ నేతలకు మంత్రి సూచించారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు.. ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ కృషితో మెతుకు సీమలో సాగునీరంది, నాణ్యమైన కరెంట్ సరఫరా, ప్రభుత్వ చేయూతతో రైతులకు మేలు జరిగిందన్నారు. రైతులు బంగారు పంటలు పండిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రుద్రారం గణపతిని దర్శించుకున్న మంత్రి
పటాన్చెరు, నవంబర్ 23 : సంకష్టహర చతుర్థి సందర్భంగా మంత్రి హరీశ్‌రావు రుద్రారం గణపతిని దర్శించుకున్నారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గణేశ్ దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ మంత్రిని పూర్ణకుంభంతో వేదపండితులు ఆహ్వానించారు. రుద్రారం సర్పంచ్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సత్కరించారు. వారితో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, పటాన్చెరు మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, నాయకులు వెంకట్‌రెడ్డి, దశరథరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, కలెక్టర్ హనుమంతరావు రుద్రారం గణపతిని దర్శించుకున్నారు. దేవస్థాన పాలకమండలి కలెక్టర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.